కదంతొక్కిన పౌర సమాజం
నెల రోజులు పూర్తి చేసుకున్న రెజ్లర్ల ఆందోళన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:బిజెపి ఎంపి, డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ప్రారంభించిన ఆందోళన నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జంతర్ మంతర్ నుంచి ఇండియా గేట్ వరకు వేలాది మంది ప్రజలు క్యాండిల్ లైట్ మార్చ్ చేపట్టారు. రెజ్లర్లకు మద్దతుగా ఢిల్లీ వీధుల్లో పౌర సమాజం కదం తొక్కింది. పోరాట వేదిక జంతర్‌మంతర్ నుంచి కాలినడకన అగ్రశ్రేణి రెజ్లర్లు ప్రారంభించిన పాదయాత్రలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు తరలివచ్చి పాల్గన్నారు. ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించారు. జాతీయ జెండాలను భుజాన వేసుకొని రెపరెపలాడించారు. అరుదైన సందర్భాల్లోనే నిరసనలను అనుమతించే ఇండియాగేట్ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ వీల్‌ఛైర్‌లో హాజరయ్యారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లతోపాటు వేలాదిమంది భాగస్వాములయ్యారు. రెజ్లర్ల అభ్యర్థన మేరకు సంయుక్త కిసాన్ మోర్చాతోపాటు రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసే వరకు పోరాటం నుంచి వెనక్కి తగ్గబోమని వినేష్ ఫోగట్‌తో సహా నిరసనకారులు ప్రకటించారు.










