- గతేడాది రూ.2 లక్షల కోట్లు : ఆర్‌బిఐ వెల్లడి
న్యూఢిల్లీ : పేద, మధ్యతరగతి వారు వేలల్లో అప్పు తీసుకుని చెల్లించకుంటేనే నానా ఆందోళన చేసే బ్యాంకులు.. బడా బాబులకు చెందిన లక్షల కోట్ల రుణాలను మాత్రం చూసి చూడనట్లుగా రద్దు చేస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఏకంగా రూ.10.57 లక్షల కోట్ల అప్పులను రద్దు చేశాయని ఆర్‌బిఐ గణంకాలు చెబుతన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనం ప్రచురించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో 2022-23లో రూ.2.09 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. మొండి బాకీల కింద చేర్చిన ఈ మొత్తాల పద్దులను తొలగించాయి. దీంతో స్థూల నిరర్థక ఆస్తులను 2023 మార్చి ముగింపు నాటికి 3.9 శాతానికి తగ్గినట్లు ఆర్‌బిఐ, ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. 2018 మార్చి ముగింపు నాటికి స్థూల నిరర్థక ఆస్తులు రూ.10.21 లక్షల కోట్లుగా ఉండగా.. 2023 మార్చి ముగింపు నాటికి రూ.5.55 లక్షల కోట్లకు తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ పద్దులను రానీ బాకీల కింద తొలగించడమే. ఆర్‌బిఐ డాటా ప్రకారం.. 2022-13 నుంచి రూ.15,31,453 కోట్ల మొండి బాకీలను రద్దు చేశారు. గడిచిన మూడేళ్లలో రూ.5,86,891 కోట్ల మొండి బాకీల్లోంచి కేవలం రూ.1,09,186 కోట్లు మాత్రమే వసూళ్లు అయ్యాయి. కేవలం 18.60 శాతం మాత్రమే రికవరీ చేయగలిగాయి. 2022-23లో రూ.2,09,144 కోట్లు, ఇంతక్రితం 2021-22లో రూ.1,74,966 కోట్లు, 2021 మార్చితో ముగిసిన ఏడాదిలో రూ.2,02,781 కోట్ల చొప్పున మొండి బాకీలను రద్దు చేశారు.










