ఒట్టావా(కెనడా): కెనడా ఓపెన్ సూపర్-300లో భారత టాప్ షట్లర్లు లక్ష్యసేన్, పివి సింధు శుభారంభం చేశారు. బుధవారం రాత్రి జరిగిన తొలిరౌండ్ పోటీలో లక్ష్యసేన్ 21-18, 211-15తో 2వ సీడ్ విదిత్‌శరణ్(థారులాండ్)పై సంచలన విజయం సాధించాడు. మరో పోటీలో బి సాయిప్రణీత్ 12-21, 17-21తో కోయల్ హో(బ్రెజిల్) చేతిలో వరుససెట్లలో ఓడాడు. ఇక మహిళల సింగిల్స్‌లో 4వ సీడ్ పివి సింధు 21-16, 21-9తో ఎన్‌జి తాలియా(కెనడా)పై సునాయాసంగా విజయం సాధించి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లింది. మరో పోటీలో గద్దె శర్వాణి 12-21, 3-21తో కంటేథోంగ్(థారులాండ్) చేతిలో ఓటమిపాలైంది. రెండోరౌండ్‌లో లక్ష్యసేన్ బ్రెజిల్‌కు చెందిన కోయల్ హోతో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్ రెండోరౌండ్‌లో పివి సింధు జపాన్‌కు చెందిన నటసుకి నిడైరాతో తలపడనుంది. ఇక పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్ గరగ-విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21-14, 21-16తో చైనీస్ తైపీ జోడీని చిత్తుచేసింది. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ పండా-స్వేతపర్ణ పండా జోడీ 21-15, 15-21, 9-21తో కెనడా జోడీ చేతిలో ఓటమిపాలైంది.










