Oct 25,2022 20:31
  • ప్లే స్టోర్‌ ఆధిపత్య దోరణీపై ఆగ్రహం

న్యూఢిల్లీ : ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) మరోసారి భారీ షాక్‌ ఇచ్చింది. ప్లే స్టోర్‌ ఆధిపత్య విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసంబద్ద వ్యాపార విధానాలకు గాను ఏకంగా రూ.936.44 కోట్ల జరిమానా విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్యాయమైన వ్యాపార పద్ధతులకు స్వస్తి చెప్పాలని, మానుకోవాలని ఆ కంపెనీని ఆదేశించింది. భవిష్యత్తులో తన ప్రవర్తనను సవరించుకోవాలని సూచించింది. మార్కెట్‌లో గూగుల్‌ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ ప్లేస్టోర్‌ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ పేమెంట్‌ యాప్స్‌, అండ్‌ పేమెంట్‌ సిస్టంను ప్రమోట్‌ చేస్తుందని సిసిఐ ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌లో గూగుల్‌కు భారీ మొత్తాన్ని ఫైన్‌ విధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో వారం రోజుల్లోనే గూగుల్‌కు రెండు సార్లు షాక్‌ ఇచ్చినట్లయ్యింది. ఇంతక్రితం అక్టోబరు 20న ఆండ్రాయిడ్‌ మొబైల్‌ పరికరాలకు సంబంధించి బహుళ మార్కెట్‌లలో దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు కంపెనీపై రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించింది. వివిధ అన్యాయమైన వ్యాపార పద్దతులను నిలిపివేయాలని, మానుకోవాలని ఆదేశించింది.