Apr 12,2023 09:11
  • రోహిత్‌ శర్మ అర్ధసెంచరీ
  • ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపు

న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌(ఐపిఎల్‌) లో ముంబయి ఇండియన్స్‌ బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ముంబయి జట్టు మంగళవారం జరిగిన ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో గెలిచి సీజన్‌-16లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 173పరుగుల లక్ష్యాన్ని నిర్ణీత 20 ఓవర్లలో పూర్తి చేసింది. చివరి బంతికి 2పరుగులు చేయాల్సిన ముంబయి.. గ్రీన్‌, టిమ్‌ డేవిడ్‌ కలిసి రెండు పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించారు. తొలుత సినీయర్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లాకు తోడు పేసర్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ మూడేసి వికెట్లతో సత్తా చాటడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 172పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీకి ఓపెనర్‌, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(51) అర్ధసెంచరీతో రాణించినా.. మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ ఘోరంగా విఫలమయ్యారు. యశ్‌ ధుల్‌(2), రువాన్‌ పావెల్‌(4), లలిత్‌ యాదవ్‌(2) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత అక్షర్‌ పటేల్‌(54; 25బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించడంతో ఢిల్లీ జట్టు ఆమాత్రమైనా స్కోర్‌ చేయగల్గింది. రిలే మెరిడిత్‌ ఆఖరి ఓవర్లో అన్రిజ్‌ నార్జ్‌(5)ను బౌల్డ్‌ చేయడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఛేదనలో ముంబయికి అదిరే ఆరంభం లభించింది. రోహిత్‌ శర్మ-ఇషాన్‌ కిషన్‌ కలిసి తొలి వికెట్‌కు 71పరుగులు జతచేశారు. ఆ తర్వాత తిలక్‌ వర్మ(41) కూడా రాణించడంతో ముంబయి జట్టు 15.5 ఓవర్లలో 132పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. సూర్యకుమార్‌ యాదవ్‌(0)మరోసారి డకౌట్‌ కాగా.. టిమ్‌ డేవిడ్‌(13), గ్రీన్‌(17) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. చివరి ఓవర్లో 5పరుగులు చేయాల్సిన ముంబయి.. ఐదు బంతుల్లో 3పరుగులే చేసింది. నోర్ట్జే వేసిన 6వ బంతికి 2పరుగులు తీయడంతో ముంబయి గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోహిత్‌కు లభించింది.