Apr 14,2023 09:28

పంజాబ్‌ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపు మొహాలీ : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్‌ విజయం సాధించింది. తొలుత బౌలర్లు రాణించడంతో పంజాబ్‌ కింగ్స్‌ను 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 153పరుగులకే పరిమితం చేసిన గుజరాత్‌.. ఆ తర్వాత 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి గెలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ను గుజరాత్‌ బౌలర్లు మోహిత్‌ శర్మ(2/18), రషీద్‌ ఖాన్‌(1/26)కి తోడు జోసెఫ్‌, లిటిల్‌ కట్టు దిట్టంగా బౌలింగ్‌ కట్టడి చేశారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన గుజరాత్‌ టైటాన్స్‌... నేటి మ్యాచ్‌లో సమిష్టిగా రాణించింది. పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ ధావన్‌(8) తక్కువ స్కోర్‌కే పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత షార్ట్‌(36), జితేశ్‌ శర్మ(25), సామ్‌ కర్రన్‌(22), షారుక్‌ ఖాన్‌(22), రాజపక్సె(20) ఫర్వాలేదనిపించారు. పంజాబ్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. నాథన్‌ ఎల్లీస్‌, సికిందర్‌ రాజా స్థానంలో భానుక రాజపక్సె, రగిసో రబడా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఛేదనలో గుజరాత్‌ ఓపెనర్లు సాహా(30), శుభ్‌మన్‌(67)) బ్యాటింగ్‌లో రాణించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 48పరుగులు జతచేశారు. ఆ తర్వాత సుదర్శన్‌(19) కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(8) నిరాశపరిచినా.. డేవిడ్‌ మిల్లర్‌(17), తెవాటియా(5) మరో వికెట్‌ పడకుం డా మ్యాచ్‌ను ముగించారు. ఆర్ష్‌దీప్‌, రబడా, హర్మన్‌ప్రీత్‌, కర్రన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మోహిత్‌ శర్మకు లభించింది.

11