Jan 11,2023 11:32
  • బోల్సనారోను జైలుకు పంపాలని నినదించిన ప్రజలు
  • జన సందోహంతో నిండిపోయిన సావోపోలో, రియో నగరాలు

బ్రసీలియా : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బ్రెజిలియన్లు కదంతొక్కారు. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బోల్సనోరా అనుచరుల దాడిని ఖండిస్తూ భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని లూలా సర్కార్‌కు మద్దతుగా నినదించారు. అమెరికా సామ్రాజ్యవాద కుట్రలకు లొంగిపోయిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బోల్సనారో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేక దేశ న్యాయవ్యవస్థపైనా అబాండాలు మోపుతూ..గత ఆది, సోమవారాల్లో పార్లమెంట్‌, అధ్యక్ష భవనం, అత్యున్నత న్యాయస్థానాలపై బొల్సనారో తన అనుచరులతో మూకుమ్మడి దాడులు చేయించారు. ఈ దాడులను మంగళవారం దేశవ్యాప్తంగా రియో డీ జెనిరో, సావోపోలో సహా పలు నగరాల్లో వేలాదిమంది ప్రజాస్వామ్య అనుకూల ర్యాలీలు నిర్వహించారు. 'క్షమాభిక్ష లేదు, బోల్సనారోను జైలుకు పంపాలి' అని నినదిస్తూ అతిపెద్ద నగరమైన సావోపోలోలో వేలాదిమంది ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. బ్రెజిల్‌లో అత్యంత ప్రఖ్యాతి చెందిన వీధి పాలిస్టా అవెన్యూలో ఒక భాగం బ్రహ్మాండంగా సాగిన ప్రజా ప్రదర్శనతో పూర్తిగా నిండిపోయింది. మొత్తంగా ఎక్కడ చూసినా జనం...న్యాయం కోసం నినదిస్తూ ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా అరుణవర్ణమయమైంది. లూలా వర్కర్స్‌ పార్టీ పతాకమైన ఎరుపు రంగులో అనేకమంది దుస్తులు ధరించారు. 'కుట్రదారులకు క్షమాభిక్ష లేదు' అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆదివారం నాటి మూక దాడులకు కారకులైన వారిని శిక్షించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. బోల్సనారోకు జైలే గతి అంటూ నినాదాలు చెలరేగాయి. ''బ్రసీలియాలో ఆదివారం జరిగిన ఘటనలతో ఏకీభవించలేం, అదొక పీడకల మాదిరిగా వుంది. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసమున్న వారెవరూ అలా వ్యవహరించలేరు'' అని గాబ్రియెల్‌ అనే ప్రదర్శకుడు మీడియాతో వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు చెల్లవంటూ దాడులకు దిగిన వారిని నిన్న ప్రపంచ దేశాలు చూశాయి. కానీ మా ప్రభుత్వం పట్ల మాకు విశ్వాసముంది, మా ప్రజాస్వామ్యం పట్ల మాకు నమ్మకముంది అని అంటున్న వేలాదిమందిని ఈనాడు చూస్తున్నారు. బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించేది వారు కాదు, మేము'' అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో చాలాచోట్ల పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. వాతావరణమంతా ఉద్రిక్తంగా వున్నట్లు కనిపిస్తోందని మీడియా వార్తలు పేర్కొంటున్నాయి.
 

                                                                      1500 మంది అరెస్టు

కాగా మరోవైపు అమెరికాలో వుంటూ దేశంలో దాడులకు పాల్పడేలా తన అనుచరులను రెచ్చగొట్టిన బోల్సనారో కడుపు నొప్పితో సోమవారం ఫ్లోరిడాలోని ఆస్పత్రిలో చేరారు. ఆదివారం నాటి దాడుల ఘటనలో దాదాపు 1500 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బ్రసీలియా గవర్నర్‌ ఇబనెస్‌ రోకాను 90 రోజుల పాటు ఆ పదవి నుండి తొలగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లను, దాడులను నివారించడంలో గవర్నర్‌ విఫలమయ్యారని న్యాయ శాఖ మంత్రి అలెగ్జాండర్‌ డీ మోరెస్‌ విమర్శించారు. దాడులతో అల్లరి మూకలు రెచ్చిపోతుంటే మౌనంగా చూస్తూ కూర్చున్నారని విమర్శించారు.