Jul 03,2023 10:10

ముంబయి : 2023 ఐసిసి వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచులకు ఆతిథ్యం అందించే అవకాశం కోల్పోయిన రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బిసిసిఐ కార్యదర్శి జై షా ఊరట అందించాడు. ఈ ఏడాది అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు భారత్‌ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. ప్రపంచకప్‌లో 48 మ్యాచులకు పది వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ మ్యాచుల కోసం ఇతర స్టేడియాలు సైతం పోటీపడినా.. బిసిసిఐ పది స్టేడియాలనే ఖరారు చేసింది. దీంతో ప్రపంచకప్‌ మ్యాచులు దక్కని స్టేడియాలకు (రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు) రానున్న ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అధిక ప్రాధాన్యత ఉంటుందని జై షా తెలిపారు. ఈ మేరకు ఐసిసి ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదలకు ముందు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో జై షా సమావేశమయ్యారు. ప్రపంచకప్‌ ఆతిథ్య వేదికలు ధర్మశాల, అహ్మదాబాద్‌, న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూర్‌, లక్నో, హైదరాబాద్‌, కోల్‌కత, పుణెలు ద్వైపాక్షిక సిరీస్‌ మ్యాచులపై ఆశలు వదులుకునేందుకు అంగీకరించినట్టు సమాచారం. వార్మప్‌ మ్యాచులు వేదికగా నిలువనున్న గువమటి, తిరువనంతపురం సైతం ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అధిక ప్రాధానత్య దక్కించుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు జై షా ఓ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం మూడు మ్యాచులతో పాటు రెండు పాకిస్థాన్‌ వార్మప్‌ మ్యాచులకు సైతం వేదికగా నిలువనుంది. హైదరాబాద్‌లో అక్టోబర్‌ 6 నుంచి ప్రపంచకప్‌ మ్యాచులు జరుగుతాయి.
 

                                                                              7న తుది నిర్ణయం

ఆసియా క్రీడల్లో భారత క్రికెట్‌ జట్ల ప్రాతినిథ్యంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఈ నెల 7న తుది నిర్ణయం తీసుకోనుంది. ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో అపెక్స్‌ కౌన్సిల్‌ శుక్రవారం సమావేశం కానుంది. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఆసియా క్రీడలకు ద్వితీయ శ్రేణి జట్టును పంపించేందుకు బిసిసిఐ గతంలో గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. అయినా, ఆసియా క్రీడల ప్రాతినిథ్యంపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటి నిర్ణయమే ఫైనల్‌ కానుంది. ప్రపంచకప్‌ వర్కింగ్‌ గ్రూప్‌ను అపెక్స్‌ కౌన్సిల్‌ భేటిలో ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది.