ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సోమవారం గుంటూరులోని అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సిఎం జగన్‌ను దూషిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై అరండల్‌పేట ఎస్‌ఐ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. బండారుకు 41ఎ కింద పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. సిఐ రామానాయక్ ఆయనను విచారించారు. వాంగ్మూలం నమోదు చేశారు. గంటన్నరపాటు విచారణ సాగింది. బండారుతోపాటు ఇద్దరు న్యాయవాదులను కూడా విచారణకు అనుమతించారు. అంతకుముందు మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇటీవల బెయిల్ పొందిన బండారు సోమవారం కోర్టుకు హాజరై వ్యక్తిగత పూచికత్తును సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షపార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేయడం సహజమని, తాను 43 ఏళ్ల నుంచి తన గళం వినిపిస్తూనే ఉన్నానని తెలిపారు.










