Mar 13,2023 11:26
  • టన్నుకు రూ.24 వేలు పలుకుతున్న ధర
  • ఎగువ రాష్ట్రాలకు పెరిగిన ఎగుమతులు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : అరటి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌, ఎగువ రాష్ట్రాల్లో అరటి దిగుబడులు లేకపోవడంతో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం టన్ను అరటి ధర రూ.24 వేలకు చేరింది. గత సీజన్‌లో టన్ను రూ.16 వేల నుంచి రూ.18 వేలకు వరకూ పలికింది. ప్రస్తుతం అరటికి మంచి ధర ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లలో ఈ ధరే అత్యధికమని వారు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా అరటి సాగు జరిగే మహారాష్ట్ర, బీహార్‌, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో దిగుబడులు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో, రాష్ట్రంలోని అరటికి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది.
 

                                          'తూర్పు', కోనసీమ జిల్లాల్లో విస్తారంగా సాగు

డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, అంబాజీ పేట మండలాల్లో విస్తారంగా అరటి సాగవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, ఉండ్రాజవరం, తాళ్లపూడి మండలాలు అరటి సాగుకు పెట్టింది పేరు. ఈ రెండు జిల్లాల్లో మరో ఎనిమిది మండలాల్లో అక్కడక్కడా అరటి సాగవుతోంది. అధికారుల గణాంకాల ప్రకారం ఈ రెండు జిల్లాల్లో సుమారు 45 వేల ఎకరాల్లో అరటి తోటలు ఉన్నాయి. ఈ సీజన్‌లో సుమారు ఎనిమిది లక్షల టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అధికారుల అంచనా వేశారు. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ పెట్టుబడి అవుతోంది. 15 నుంచి 17 టన్నుల వరకూ దిగుబడి వస్తోంది.
         ఈ లెక్కన ఎకరాకు రూ.2 లక్షల వరకూ లాభం రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ధర ఎంతకాలం ఉంటుందో చూడాలని వారంటున్నారు.
 

                                                     రోజూ 250 లారీలపై ఎగుమతి

రావులపాలెం, పెరవలి అరటి మార్కెట్లు ఉన్నాయి. ప్రస్తుతం డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఈ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గతంలో వంద నుంచి 120 లారీల్లో ఇక్కడ నుంచి అరటిని ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం డిమాండ్‌ పెరగడంతో రోజుకు 200 నుంచి 250 వరకూ లారీల్లో అరటిని ఎగుమతి చేస్తున్నారు. ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కోల్‌కత్తా తదితర ఉత్తరాది రాష్ట్రాలకు ప్రతి రోజూ అరటి ఎగుమతులు జరుగుతున్నాయి.

112

                                                               ఆశాజనకం ధరలు

ఐదు ఎకరాల్లో కర్పూర రకం అరటి సాగు చేస్తున్నాను. పది రోజులుగా అరటి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గతంలో టన్ను అరటి రూ.16 వేలు ఉండేది ప్రస్తుతం రూ.24 వేల వరకూ పలుకుతోంది. డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరో నెల రోజుల పాటు ఈ ధరలు ఉంటాయని అంచనా. కొంతకాలంగా నష్టాల్లో ఉన్న అరటి రైతులకు ఈ ధరలు కొంత ఊరటనిచ్చాయి.
                            మద్దిపాటి జానకి, తీపర్రు, పెరవలి మండలం

22

                                                      విడి గెలలకూ పెరిగిన డిమాండ్‌

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో రావుల పాలెం, తాడేపల్లి గూడెం, రాజమహేం ద్రవరం మార్కెట్లలోనూ విడి గెలలకుడిమాండ్‌ పెరిగింది. ఒక అరటి గెల రూ.250 నుంచి రూ.300 చొప్పున పలుకుతోంది. గతంలో గెల రూ.100లోపునే అమ్ముకోవాల్సి వచ్చేది. ఏడాదిలో ఒక నెల మాత్రమే డిమాండ్‌ ఉంటుంది. ఇతర సమయాల్లో తక్కువ ధరకు విక్రయించక తప్పడం లేదు. ప్రభుత్వం అరటిని నిల్వ చేసుకునే సౌకర్యాలు కల్పించి రైతులను ఆదుకోవాలి.
                                             దేవరపల్లి సత్యనారాయణ, తీపర్రు, పెరవలి మండలం