భువనేశ్వర్ : తెల్లవారు జాము 2గంటల సమయం...బహనగ రైల్వే స్టేషన్ మరుభూమిని తలపిస్తోంది. బోగీల నుండి వెలికి తీసిన మృత దేహాలు అక్కడ గుట్టలుగా పడివున్నాయి. వాటిని ట్రక్కుల్లో తీసుకుని ఆ సమీపంలోని హైస్కూల్ ఆవరణలో వుంచారు. నేలపై నిర్జీవంగా పడి వున్న ఆ శవాల జేబుల్లోని మొబైల్స్ నిరంతరంగా మోగుతునే వున్నాయి. తమవారి ఆచూకీ తెలుసుకునేందుకు ఆతృతగా వారు చేస్తున్న ఫోన్లతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. వరుసగా వస్తున్న బాధితుల ఆక్రందనలతో బాలాసోర్ జిల్లా ఆస్పత్రి, సోరో హాస్పిటల్‌లు కదన రంగాన్ని తలపించాయి. స్ట్రెచర్లపై, బయట కారిడార్లలో, గదుల్లో ఎక్కడ చూసినా క్షతగాత్రులే కనిపిస్తున్నారు. వారికి అవసరమైన చికిత్సలందిస్తూ డాక్టర్లు, నర్సులు అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారు.
ప్రధాని మోడీ పరామర్శ
ప్రమాద స్థలిని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు. స్థానిక అధికారులు, విపత్తు సహాయక సిబ్బంది, రైల్వే అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ మహా విషాద సమయంలో యావత్ ప్రభుత్వం బాధితులకు అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. అక్కడ నుండే కేబినెట్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సాయం అందేలా చూడాల్సిందిగా ఆదేశించారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ, దోషులెవరైనా వదిలిపెట్టేది లేదని చెప్పారు.
మనసును కలచివేసింది : నవీన్ పట్నాయక్
బాలాసోర్‌లోని జిల్లా హెడ్‌క్వార్టర్ ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలు ప్రమాద ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. సకాలంలో స్థానికులు స్పందించిన తీరును ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించారు.










