Sep 20,2023 22:03
  •  పాలకుల విధానాల వల్లే వలసలు పెరుగుతున్నాయి..
  • సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య

ప్రజాశక్తి-కొండపి (ప్రకాశం జిల్లా) : దేశంలో, రాష్ట్రంలో పాలకుల విధానాల వల్ల అభివృద్ధి లేక, సాగు, తాగునీరు లేక ప్రజల వలసలు పెరుగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని పెరిదేపి గ్రామంలో సిపిఎం పోరు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి బహిరంగ సభ జరిగింది. సిపిఎం జిల్లా కమిటీి సభ్యులు కెజి మస్తాన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కృష్ణయ్య మాట్లాడారు. పన్నుల భారాల నుంచి కార్పొరేట్లకు విముక్తి కల్పించి వారి ఆస్తులను రూ.కోట్లల్లో పెరిగే విధంగా చేసిన ఘనత బిజెపి ప్రభుత్వానిదేనని విమర్శించారు. ప్రజలను మద్యానికి బానిసలను చేసి, వారి సమస్యలపై ప్రశ్నించకుండా ఉండేలా పాలకులు చేస్తున్నారని తెలిపారు. సిపిఎం పోరుబాట పాదయాత్ర ప్రజల అభివృద్ధిని కోరుతూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. సాగునీరు, పంటల గిట్టుబాటు ధరలపై పాలకులు దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబును జైలుకు పంపడంపై వైసిపి, టిడిపి నాయకుల మధ్య చర్చే తప్ప, ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు. అభివృద్ధిని విస్మరించి పాలన సాగిస్తూ, జిల్లాలో వెనుకబాటుతనానికి కారణమైన పాలకులను రాబోయే రోజుల్లో నిలదీస్తూ ప్రజలు చైతన్యవంతంగా ఉద్యమించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అండ్రా మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, కానీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయినా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి నిరుద్యోగుల్ని చేసిన పరిస్థితి ఉందని తెలిపారు. కార్యక్రమంలో పోరుబాట బృందం నాయకులు పాల్గొన్నారు.

సంతనూతలపాడుకు చేరిన పాదయాత్ర

సిపిఎం పోరుబాట పాదయాత్ర బుధవారం కొండపి నియోజకవర్గం నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సంతనూతలపాడు మండలంలోని మద్దులూరు, మాచవరం, చిలకపాడు, తక్కెళ్లపాడు, గంగవరం గ్రామాలలో పాదయాత్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యల్ని పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు.