Oct 14,2023 08:39

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :మతోన్మాద బిజెపి ఆధ్వర్యంలో ఎన్‌డిఎ కూటమికి, లౌకికవాద ఇండియా పక్షానికి సమదూరంలో ఉంటామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రకటన అర్థరహితమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమిత్‌షా మాటలు నమ్మి బిజెపి వలలో పడితే టిడిపి నష్టపోవడం తప్ప సాధించేదేమీ ఉండదన్నారు. తనను కలిసిన మీడియా వారితో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో చేరుతారా? లేదా? అనేది తెలుగుదేశం పార్టీ ఇష్టమని, సమదూరం పేరుతో మతోన్మాద బిజెపికి సానుకూలంగా వ్యవహరించడం ప్రమాదకరమని పేర్కొన్నారు. మతోన్మాదానికి, లౌకికవాదానికి సమదూరం పాటించడమంటే మతోన్మాదానికి మేలు చేయడమేనని, రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని విస్మరించడం అన్యాయమని విమర్శించారు. చంద్రబాబు అరెస్టుతో తమకు సంబంధం లేదని చెబుతున్న బిజెపి అధినాయకత్వం ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నదో చెప్పాలన్నారు. దాన్ని టిడిపి శ్రేణుల చేత నమ్మేలా చూడడం మోసకారితనం అవుతుందని అన్నారు. బిజెపి మతోన్మాదం, రాష్ట్రానికి చేసిన విద్రోహంపై టిడిపి శ్రేణులను తప్పుదారి పట్టించొద్దని టిడిపి నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా టిడిపి భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మతోన్మాద బిజెపిని వ్యతిరేకిస్తూ ముందుకు రావాలని కోరారు.