Apr 11,2023 21:34

లక్నో: లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌పై బిసిసిఐ చర్యలకు ఉపక్రమించింది. బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్‌ఖాన్‌ ఐపిఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లెవల్‌-1 ఉల్లంఘనకు పాల్పడ్డాడు. చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఆఖరి బంతికి సింగిల్‌ తీసి లక్నోను గెలిపించిన అతను ఉద్రేకాన్ని నియంత్రించుకోలేక పోయాడు. ఆవేశంగా హెల్మెట్‌ను నేలకేసి కొట్టి సంబరాలు చేసుకున్నాడు. దీంతో అతడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బిసిసిఐ చర్యలు తీసుకోనుంది. అవేశ్‌ ఖాన్‌ కూడా తన నేరాన్ని అంగీకరించాడని, అయితే.. అతడిపై బిసిసిఐ ఎలాంటి చర్యలు తీసుకోనుందో మ్యాచ్‌ రిఫరీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్‌ ఫాఫ్‌ డూప్లెసిస్‌ జరిమానాకు గురయ్యాడు. స్లో ఓవర్‌ రేటు కారణంగా మ్యాచ్‌ రెఫరీ అతడికి రూ.12 లక్షల జరిమానా విధించారు.