బిసిసిఐలో పనిచేసే ఆఫీస్ బేరర్స్ అలవెన్స్‌లు భారీగా పెరిగాయి. విదేశీ పర్యటనలకు వెళ్లే ఆఫీస్ బేరర్స్ జీతభత్యాలను భారీగా పెంచుతూ బిసిసిఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటనలకు వెళ్లే ఆఫీస్ బేరర్లకు ఫస్ట్‌క్లాస్ టికెట్‌తో పాటు రోజువారీ అలవెన్స్‌ను పెంచింది. తాజాగా అపెక్స్ కౌన్సిల్ భేటీలో బిసిసిఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ సౌకర్యాలన్నీ గతేడాది అక్టోబర్ నుంచే అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. దాదాపు ఏడేళ్ల తర్వాత రోజువారీ అలవెన్స్‌లో మార్పులు చేసింది. ఇంతకుముందు 750 డాలర్లుగా ఉండే అలవెన్స్‌ను వెయ్యికి పెంచేసింది. ఇక దేశంలో జరిగే సమావేశాలకు హాజరయ్యే బీసీసీఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్, సంయుక్త కార్యదర్శి సహా ఆఫీస్ బేరర్లకు రోజుకు రూ.40వేల అలవెన్స్‌ను బిసిసిఐ చెల్లించనుంది. బిజినెస్ క్లాస్ టికెట్ ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది. 'వర్క్ ట్రావెల్' కోసం రోజుకు రూ. 30వేలు, సూట్ రూమ్ బుక్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ఐపీఎల్ ఛైర్మన్‌కు కూడా ఆఫీస్ బేరర్స్ కేటగిరీలో అలవెన్సులు వర్తిస్తాయి. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా త్రైమాసిక సమావేశాలకు హాజరైతే రూ.40వేలు, విదేశీ పర్యటనలకు వెళ్తే 500 డాలర్లను రోజువారీ అలవెన్సులుగా చెల్లిస్తుంది. ముగ్గురు సభ్యులు కలిగిన క్రికెట్ సలహా కమిటీ, పురుష, మహిళా జట్ల ప్రధాన కోచ్‌లు హాజరయ్యే ప్రతి సమావేశానికి రూ.3.5 లక్షలు ఇవ్వనుంది. సమావేశాల కోసం విదేశీ ప్రయాణాలు అవసరంలేనప్పటికీ.. ఒకవేళ వెళ్తే మాత్రం రోజుకు 400 డాలర్లు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. వీరంతా గౌరవ పదవుల్లో ఉండే ఆఫీస్ బేరర్ల కేటగిరీలోకి వస్తారు. అదే బీసీసీఐ సీఈవోకు.. విదేశీ పర్యటనకు వెళ్తే 650 డాలర్లు, స్వదేశంలో అయితే రూ.15 వేలను భత్యంగా చెల్లిస్తుంది.










