బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. ఇటీవల టీమిండియా క్రికెటర్లపై చేతన్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిట్‌నెస్ లేని క్రికెటర్లు ఇంజెక్షన్లు తీసుకుంటారని చేసిన వ్యాఖలపై తీవ్ర దుమారం రేగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో... చేతన్ శర్మ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ ఛైర్మన్ జై షాకు పంపగా బీసీసీఐ ఆమోదించింది.
ఓ టీవీ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ భారత జట్టులో నెలకొన్న పరిస్థితులపై పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. కొందరు భారత క్రికెటర్లు ఫిట్‌గా లేనప్పటికీ ఇంజక్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. వారు తీసుకుంటున్న ఇంజక్షన్లను డోపింగ్ పరీక్షల్లో సైతం గుర్తించలేరని తెలిపారు. 80 శాతం ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు కీలకమైన మ్యాచ్‌లకు ముందు ఇంజక్షన్లు తీసుకొని పూర్తి ఫిట్ నెస్‌తో ఉన్నట్లుగా చూపి మ్యాచ్‌లు ఆడుతున్నట్లు చేతన్ శర్మ వ్యాఖ్యానించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయని చేతన్‌శర్మ చెప్పారు. మరోవైపు టీమిండియాలో రెండు వర్గాలు ఉన్నాయని.. వాటికి కోహ్లీ, రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కోహ్లీల మధ్య కూడా అంతర్గత చర్చలకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జట్టుకు సంబంధించిన రహస్య వివరాలు బయటకు రావడంపై బీసీసీఐ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.










