Feb 16,2023 22:07

టి20 మహిళల ప్రపంచకప్‌
కేప్‌టౌన్‌: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోకి ఆస్ట్రేలియా జట్టు దూసుకెళ్లింది. గురువారం జరిగిన గ్రూప్‌ాఏ లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 10వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. లంకను తొలిగా బ్యాటింగ్‌ చేయాల్సిందిగా ఆహ్వానించింది. ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో లంక జట్టు 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 112పరుగులే చేయగల్గింది. ఓపెనర్లు మాధవి(34), కెప్టెన్‌ ఆటపట్టు(16), గుణరత్నే(24), డిాసిల్వ(15) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. స్కట్‌కు నాలుగు, హర్రీస్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు హీలీ(54), మూనీ(56) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్‌ జట్టు 15.5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 113పరుగులు చేసి సునాయాసంగా గెలిచింది. దీంతో ఆసీస్‌ జట్టు హ్యాట్రిక్‌ విజయాలతో గ్రూప్‌ాఏలో అగ్రస్థానంలో ఉంది. ఇక లంక జట్టు 4పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నా.. 19న న్యూజిలాండ్‌తో జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌కు చేరనుంది.
మునీబా సెంచరీ
ఐర్లాండ్‌పై పాకిస్తాన్‌ గెలుపు
పాకిస్తాన్‌ ఓపెనర్‌ మునీబా సెంచరీతో కదం తొక్కడంతో గ్రూప్‌ాబిలో పాకిస్తాన్‌ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం రాత్రి ఐర్లాండ్‌ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ జట్టు 70పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 165పరుగులు చేసింది. ఓపెనర్‌ మునీబా(102) సెంచరీకి తోడు నిదా ధార్‌(33) బ్యాటింగ్‌లో రాణించింది. ఛేదనలో ఐర్లాండ్‌ జట్టు 16.3ఓవర్లలో 95పరుగులకే కుప్పకూలింది. రిచర్డుసన్‌(28), ఓర్లా(31) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. నశ్రా సంధుకు నాలుగు, నిదాధర్‌, సాదియా ఇక్బాల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
టి20 ప్రపంచకప్‌లో నేడు..
న్యూజిలాండ్‌ × బంగ్లాదేశ్‌(సా.6.30గం||లకు)
వెస్టిండీస్‌ × ఐర్లాండ్‌(రా.10.30గం||లకు)