Jun 16,2023 08:28
  • ఆగస్టు 31నుంచి సెప్టెంబర్‌ 17వరకు టోర్నీ
  • పాకిస్తాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది వన్డేలు
  • షెడ్యూల్‌ ఖరారు

ముంబయి : ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌ వేదికలు ఖరారయ్యాయి. పాకిస్తాన్‌, శ్రీలంక సంయుక్తంగా 2023 ఆసియాకప్‌ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నట్లు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఎసిసి) గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 31నుంచి సెప్టెంబర్‌ 17వరకు ఈ టోర్నమెంట్‌ జరగనున్నట్లు ఎసిసి ఆ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌, శ్రీలంకతోపాటు భారత్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, నేపాల్‌ జట్లు పాల్గోనున్నాయి. మొత్తం 13వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి టోర్నీలో తలపడే ఆరుజట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లోని ఒక జట్టు మిగిలిన రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడనుంది. రెండు గ్రూపుల్లో టాప్‌-2లో నిలిచి జట్లు సూపర్‌-4 స్టేజ్‌లో తలపడనున్నాయి. సూపర్‌-4లో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టోర్నీ 18 రోజులపాటు జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ జరుగుతుందని ఎసిసి వెల్లడించింది. దీంతో 15ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ టోర్నీకి అతిథ్యమిచ్చే అవకాశం పాకిస్థాన్‌కు రావడం గమనార్హం. మరోసారి భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం అభిమానులకు రానుంది. అయితే శ్రీలంక వేదికగానే ఇరుజట్ల మ్యాచ్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 17న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.
               భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బిసిసిఐ), పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పిసిబి) బోర్డుల మధ్య సఖ్యత లేని కారణంగా ఆసియా కప్‌ నిర్వహణపై తొలుత సందిగ్ధత నెలకొంది. పాకిస్తాన్‌ కు తమ జట్టును పంపించేం దుకు బిసిసిఐ నిరాకరించడంతో పిసిబి తమ జట్టును భారత్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనేది లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తమ దేశంలో కొన్ని, తటస్థ వేదికల్లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించేలా హైబ్రిడ్‌ మోడల్‌ను పాక్‌ ప్రతిపాదిం చింది. బిసిసిఐ సహా శ్రీలంక, బంగ్లా దేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ అందుకు అంగీక రించకపోవడంతో ఆ సమస్య మరింత జఠిలమైంది. దీంతో ప్రపంచకప్‌లో ఆడేది లేదని పాక్‌ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో దాయాదుల పోరు లేకుండా ప్రపంచ కప్‌ జరిగితే టోర్నీకి ఆకర్షణ తగ్గుతుం దని భావించిన ఐసిసి రంగంలోకి దిగింది. ఎలాంటి షరతులు లేకుండా పాక్‌ను ఒప్పిం చింది. అదే క్రమంలో పాక్‌ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ను ఎసిసి కూడా అంగీకరిం చడంతో ఆసియా కప్‌ నిర్వహణకు అడ్డంకులు తొలిగి పోయాయి. భారత్‌ ఆడే మ్యాచ్‌లతో పాటు సూపర్‌-4 పోరు శ్రీలంకలో జరుగు తుంది. ఇంకా వేదికలను ఖరారు చేయాల్సి ఉంది. గత ఏడాది టి20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ విజేతగా శ్రీలంక నిలిచింది.