ఓమన్ : ఆసియాకప్ హాకీ జూనియర్స్ విభాగంలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సలలాహ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సెమీఫైనల్లో భారత్ 6-0గోల్స్ తేడాతో పటిష్ట కొరియాపై విజయం సాధించింది. తొలి రెండో క్వార్టర్లు ముగిసేసరికి 2-0 గోల్స్ ఆధిక్యతలో నిలిచిన భారత యువ హాకీ జట్టు.. మూడో క్వార్టర్‌లో ఏకంగా నాలుగు గోల్స్ కొట్టి కొరియాపై ఆధిప్యతం చెలాయించింది. సుమిత్ లక్రా(13వ ని.)లో డ్రిబ్లింగ్ చేసి గోల్ చేయగా.. 19వ ని.లో. అరైజిత్ సింగ్ మరో గోల్ కొట్టాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి భారత్ 2-0తో ఆధిక్యతలో నిలిచింది. మూడో క్వార్టర్ ప్రారంభమైన 31వ ని.లోనే ధమి బాబీ సింగ్ 22 యార్డ్స్ నుంచి కొరియా గోల్ పోస్ట్‌లోకి బంతిని పంపడంతో భారత్ 3-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. అంగద్‌బీర్ సింగ్(34వ ని.), ఉత్తమ్ సింగ్(38వ ని.), ధమ్మీ బాబీసింగ్(38వ ని.)లో ఒక్కో గోల్ కొట్టారు. దీంతో భారత్ మూడో క్వార్టర్ ముగిసే సమయానికి తిరుగులేని 6-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. నాల్గో క్వార్టర్ ఇరుజట్లు ఒక్కో గోల్ కొట్టడంతో 7-1తో నిలిచాయి.










