Jun 24,2023 14:15

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో వైసిపి,టిడిపి సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. గుంటూరు నగరంలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ అభివృద్ధి చేయాలని టిడిపి కార్పొరేటర్లు సమావేశంలో పట్టుబట్టారు. నగర పరిధిలో ఉన్న అనేక కూడళ్లను అభివృద్ధి చేసి ఎన్టీఆర్‌ కూడలిని మాత్రం ఎందుకు వదిలేశారంటూ టిడిపి కార్పొరేటర్లు అధ్యక్షుడు కావటి మనోహర్‌ నాయుడిని ప్రశ్నించారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని వైసిపి కార్పొరేటర్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎన్టీఆర్‌ కూడళ్లను తానే అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ముస్తఫా హామీ ఇవ్వగా.. టిడిపి కార్పొరేటర్లు స్పందిస్తూ.. అసత్యాలు చెప్పొద్దని వాగ్వాదానికి దిగారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌ని అభివృద్ధి చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ కౌన్సిల్‌ హాల్‌లోనే బైఠాయించి నిరసన తెలిపారు.రూ.9 లక్షలు విడుదల చేసినా కాంట్రాక్టర్‌ పని చేయలేదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అయితే, కాంట్రాక్టర్‌ను ఎందుకని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టలేదని టిడిపి కార్పొరేటర్లు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ.. ''ఎమ్మెల్యేగా నేను అడిగినా రూ.లక్షతో కల్వర్ట్‌ నిర్మాణం చేయలేదు. అధికార పార్టీలో ఉన్నా.. నేను చెప్పిన పనులు చేయట్లేదు. రెండున్నరేళ్లు వేచిచూశాను. ఏఈని కౌన్సిల్‌కు పిలిపించాలి. ఏఈ వచ్చే వరకు కౌన్సిల్‌ సమావేశం నిలిపివేస్తున్నాం'' అని ఎమ్మెల్యే వెల్లడించారు.