Jul 08,2023 22:18

ముంబయి: భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో ఆడే విషయమై ఓ నిర్ణయం తీసుకోవాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) అపెక్స్‌ కౌన్సిల్‌ను కోరింది. బిసిసిఐ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్‌ ప్రకటించని ఆటగాడు ఐపిఎల్‌, దేశవాళీ, జాతీయ టోర్నమెంట్‌కే పరిమితమై ఉండాలి. ఒకవేళ విదేశీ లీగ్‌లలో ఆడాలంటే బిసిసిఐ అనుమతి తప్పనిసరి. దేశ, విదేశాల్లో అనేక లీగ్‌ల ఆవిర్భాం, ఆ లీగ్‌లకు ఐపిఎల్‌ ఫ్రాంచైజీ యజమానులే ఉన్న దృష్ట్యా భారత ఆటగాళ్లు ఆ లీగ్‌లలో ఆడే అవకాశం దక్కడం లేదు. ఈ క్రమంలో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు అంబటి రాయుడు రిటైర్మెంట్‌ ప్రకటించి అమెరికా వేదికగా జరిగే టి20లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ అంశాన్ని పరిశీలిస్తూ.. విదేశీ లీగ్‌లలో భారత ఆటగాళ్లను ఆడేందుకు అనుమతిస్తే.. ఆటగాళ్లు ముందే రిటైర్మెంట్‌ ప్రకటించరని బిసిసిఐ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అపెక్స్‌ కౌన్సిల్‌ ఈ సమస్యను చర్చించి ఆటగాళ్లకు న్యాయం చేసేలా మార్గదర్శకాలు తీసుకోవాలని, తదుపరి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నాటికి బోర్డుకు కార్యాచరణ ప్రణాళికపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.