Apr 15,2023 09:44
  • సెంచరీతో కదం తొక్కిన బ్రూక్‌
  • కోల్‌కతాపై 23పరుగుల తేడాతో గెలుపు

కోల్‌కతా : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో వేదికగా జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 23 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత హైదరాబాద్‌ ఓపెనర్‌ హారీ బ్రూక్స్‌ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో కోల్‌కతా జట్టు చివరివరకు పోరాడి 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 205పరుగులే చేయగల్గింది. తొలుత టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(9)కి తోడు త్రిపాఠి(9) నిరాశపరిచారు. మరో ఓపెనర్‌ హారీ బ్రూక్స్‌ క్రీజ్‌లో నిలదొక్కుకున్నా.. కెప్టెన్‌ మార్‌క్రమ్‌(50; 26బంతుల్లో 2ఫోర్లు, 5సిక్సర్లు) పరుగుల వేట మొదలు పెట్టాడు. ఐపిఎల్‌ మినీ వేలంలో ఇంగ్లండ్‌ ఆటగాడు హారీ బ్రూక్‌కు లభించిన ధర రూ.13.25 కోట్ల ధరకు న్యాయం చేస్తూ ఈ సీజన్‌లో తొలిసారి బ్యాట్‌కు పని చెప్పాడు. కోల్‌కతా బౌలర్లను వారి సొంతగడ్డపైనే తుత్తునియలు చేస్తూ 24ఏళ్ల బ్రూక్‌ కేవలం 55 బంతుల్లో 12 ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఆఫ్‌ సైడ్‌ కొట్టిన సిక్సులు ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. మరో ఎండ్‌లో కెప్టెన్‌ మార్‌క్రమ్‌ కూడా అర్ధసెంచరీతో మెరిసాడు. ఇక అభిషేక్‌ శర్మ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. ఆఖర్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ 6 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఐపిఎల్‌ చరిత్రలో సన్‌రైజర్స్‌ రెండో అత్యధిక స్కోర్‌ను ఈడెన్‌ గార్డెన్స్‌లో నమోదు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ఆండీ రస్సెల్‌కు మూడు, వరుణ్‌ చక్రవర్తికి ఒక వికెట్‌ లభించాయి.
         ఛేదనలో కోల్‌కతా కెప్టెన్‌ నితీశ్‌ రాణా(75), రింకూ సింగ్‌(58), జగదీశన్‌(38) మాత్రమే బ్యాటింగ్‌లో మెరిసారు. గుర్బాజ్‌(0), నరైన్‌(0), ఆండీ రస్సెల్‌(3) నిరాశపరిచారు. చివరి ఓవర్లో కోల్‌కతా 32పరుగులు చేయాల్సిన రాగా.. 8పరుగులే చేసి ఓటమిపాలైంది జాన్సెన్‌, మార్కండేకు రెండేసి, భువనేశ్వర్‌, నటరాజన్‌, ఉమ్రన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బ్రూక్స్‌కు లభించింది.

table