ప్రజాశక్తి- తిరుమల : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. రెండు లక్షల మంది యాత్రికులు వీక్షించేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తిరుమలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో 1.30 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు సర్వదర్శనం యాత్రికులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు టిటిడి అందించనుందని చెప్పారు. నడకదారిలో ఆంక్షలు కొనసాగుతాయన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో బ్రేక్ దర్శనాలు, సిఫారసు లేఖలను అనుమతించబోమని తెలిపారు.
18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుమలలో సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 17న రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవారి తరుఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనుల వారు మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం ఆలయంలో భూమాతకు ప్రత్యేకపూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటి వాటికి మొలకలొచ్చే వరకు నీరు పోస్తారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.
రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు
ఈ నెల 18న సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.










