- బుద్ధప్రసాద్‌కు గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు బహూకరణ
ప్రజాశక్తి - మచిలీపట్నం రూరల్ :వందేమాతరం ఉద్యమంలో చురుగ్గా పాల్గనడంతో గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రా బాలగంగాధర్ తిలక్‌గా పేరు గడించారని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ శ్లాఘించారు. గ్రంథాలయ ఉద్యమ పితామహులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు 140వ జయంతి ఉత్సవాలను కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కఅష్ణా విశ్వవిద్యాలయంలో గాడిచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గని మాట్లాడారు. జాతీయతావాదిగా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులుగా, సంఘసంస్కర్తగా, బహుభాషా కోవిదుడుగా, పాత్రికేయుడుగా, కవిగా, నాటక రచయితగా, రాజకీయవేత్తగా బహుముఖ పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి గాడిచర్ల అని కొనియాడారు. మహాత్మ గాంధీ స్థిరమైన అనుచరులుగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గన్నారని గుర్తు చేశారు. 1908లో పూనాలో బాలగంగాధర్ తిలక్ అరెస్ట్ అయిన సమయంలోనే బందరులో గాడిచర్ల అరెస్టు కావడంతో ఆంధ్ర తిలక్‌గా పేరొందారని అన్నారు. స్వరాజ్య వారపత్రిక నిర్వహించడమే కాకుండా, ఆంధ్ర పత్రిక తొలి ఎడిటర్‌గా సేవలు అందించారని వివరించారు. యంగ్ ఇండియా పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసంలో హరి సర్వోత్తమరావును మహాత్మ గాంధీ ధైర్యశాలిగా కీర్తించారన్నారు. స్వరాజ్య పార్టీ నుండి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు కర్నూలు జిల్లా నుండి ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం తెలుగు భాష అభివృద్ధికి చేస్తున్న కృషికిగానూ మాజీ ఉపసభాపతి, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.చంద్రశేఖర కల్కురా, రావి శారద, కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి జ్ఞానమణి, తదితరులు పాల్గొన్నారు.










