ఈ ఏడాది మరో నూతన జట్టు ప్రవేశం
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జూన్ 17 నుంచి జూలై 2 వరకు విశాఖపట్నంతో పాటు మరో రెండు వేదికల్లో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-2 పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతంలోని ఆరు జట్లతో పోటీలు నిర్వహించామని, ఈ ఏడాది మరో జట్టును అదనంగా చేర్చనున్నామని తెలిపారు. మొత్తం 21 లీగ్ మ్యాచ్‌లు, 4 నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయని వెల్లడించారు. ఈ ఏడాదితో పాటు రానున్న మూడేళ్లపాటు జాతీయ క్రీడా ఛానల్స్ స్టార్ స్పోర్ట్స్ వన్, స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్స్‌లో ఈ పోటీలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయని తెలిపారు. సీజన్-2 పోటీలకు ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఈ నెల 17న జరుగుతుందని, ఇప్పటికే 369 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. ఐకాన్ క్రీడాకారునికి రూ.1,50,000, బి కేటగిరీ క్రీడాకారునికి రూ.లక్ష, సి కేటగిరీ క్రీడాకారునికి రూ.25 వేలు బేస్ ప్రైస్‌గా ఉందని వెల్లడించారు.
కొత్త జట్ల నమోదు ప్రక్రియ
ఈ నెల 8 నుంచి 12వ తేదీ మద్యాహ్నం 3 గంటల వరకు మధురవాడలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో కొత్త జట్లు నమోదు చేసుకోవాలని, రూ.10 వేలు చెల్లించి అప్లికేషన్ పొందవచ్చునని తెలిపారు. రూ.రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చెల్లించిన వారు మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బిడ్డింగ్ వివరాలను 13న తెరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ కోశాధికారి చలం, సిఇఒ శివారెడ్డి, మెంబెర్ జివివి గోపాల్‌రాజు, మాజీ అధ్యక్షుడు సత్య ప్రసాద్ పాల్గొన్నారు.










