Jun 13,2023 09:39
  • పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థుల నామినేషన్‌ అడ్డగింత
  • దాడులు, పార్టీ కార్యాలయాలు ధ్వంసం
  • పలువురికి తీవ్రగాయాలు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడంతో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు బరి తెగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ముఖ్యంగా సిపిఎం అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా దాడులకు దిగుతున్నారు. పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. టిఎంసి గూండాల దాడిలో అనేక మంది ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు గాయపడ్డారు. సోమవారం పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా ఇలాంటి దాడులు అనేకం జరిగాయని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడానికి వెళుతున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై దాడులు జరిగాయని ఆయన చెప్పారు. బసిర్హాత్‌ సబ్‌ డివిజన్‌లోని మినాఖాన్‌లోని సిపిఎం కార్యాలయంపై దాడి జరిగిందని, నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళుతున్న పార్టీ అభ్యర్థిని తీవ్రంగా గాయపర్చారని అధికారి చెప్పారు. బాన్‌కురా జిల్లాలోని సోనాముఖిలో జరిగిన మరొక ఘటనలోనూ నామినేషన్‌ వేయడానికి వెళుతున్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిపైనా దాడి జరిగిందని చెప్పారు.
           ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై దాడులు జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఇసి) కూడా ప్రకటించింది. 'ఇలాంటి దాడులు అనేకం జరిగినట్లు నివేదికలు వచ్చాయి. జిల్లా మేజిస్ట్రేట్‌, ఎస్‌పిలను ఈ దాడులపై పూర్తి వివరాలను కోరాం' అని ఎస్‌ఇసికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. అన్ని నామినేషన్‌ కేంద్రాల వద్ద ఒక కిలోమీటర్‌ వ్యాసార్థంలో సిఆర్‌పిసి సెక్షన్‌ 144ను అమలు చేయాలని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు, ఎస్‌పిలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ 10 వేలకు పైగా నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయని తెలిపింది.
 

                                                          16 వరకూ నామినేషన్‌ గడువు పొడిగింపు

పంచాయితీ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసే గడువును పొడిగించాలని, పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు దాఖలు చేసిన పిటీషన్‌పై కోల్‌కతా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. నామినేషన్‌ దాఖలు గడువును ఈ నెల 16 వరకూ పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. జులై 8న పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి.
మినాఖాన్‌ పార్టీ కార్యాలయంపై దాడులు
 

                                                               పలువురు నేతలకు తీవ్రగాయాలు

మినాఖాన్‌లోని సిపిఎం కార్యాలయంపై టిఎంసి గూండాలు దాడికి తెగబడ్డారు. సిపిఎం అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు సామాగ్రిని నాశనం చేశారు. ఈ దాడిలో ఐద్వా సిఇసి సభ్యులు, ఉత్తర 24 పరగణాల నాయకులు సోమదాస్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా పలువురు అభ్యర్థులు, కార్యకర్తలు కూడా గాయపడ్డారు.
టిఎంసి హింసాకాండకు వ్యతిరేకంగా సిపిఎం నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. పురులియాలోని పుంచాలో జరిగిన ర్యాలీలో కేంద్ర కమిటీ సభ్యులు అమియా పాత్ర ప్రసంగించారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని కుల్తాలిలో జరిగిన సభలో కేంద్ర కమిటీ సభ్యులు సుజన్‌ చక్రవర్తి ప్రసంగించారు. పంచాయితీ ఎన్నికల్లో టిఎంసి, బిజెపిలను ఓడించి ప్రజల కోసం పనిచేసే పంచాయతీలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.