- పోలవరం ప్రాజెక్టు ముంపు అంచనాలు తారుమారు
- ఇప్పటికైనా శాస్త్రీయ అధ్యయనం అవసరం
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల మదింపులో చెప్పిన కాంటూరు లెక్కలన్నీ బూటకమని తేలిపోయింది. వాస్తవాలను కళ్లకు కట్టినట్లు ప్రస్తుతం ముంచెత్తిన వరద చెప్పకనే చెప్పింది. వరద ముంపు ఉండదని చెప్పి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో నిర్మించిన పునరావాస కాలనీలను సైతం వరద చుట్టుముట్టింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే ఈ పరిస్థితి ఉంటే, పూర్తయిన తర్వాత ఏ విధంగా ఉంటుందోనని నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను 41.15 మీటర్ల ఎత్తు కాంటూరుగా, 45.70 మీటర్ల ఎత్తు కాంటూరుగా అధికారులు నిర్థారించారు. ఈ ప్రాతిపాదికన గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ ఎత్తు 42 మీటర్ల వరకూ నిర్మాణం జరిగింది. దీంతో, మొదటి కాంటూరు పరిధిగా పేర్కొన్న కుక్కునూరు మండలంలో ఎనిమిది గ్రామాలు, వేలేరుపాడు మండలంలో 18 గ్రామాలకు చెందిన 7,071 కుటుంబాలను ఖాళీ చేయిస్తే సరిపోతుందంటూ తేల్చారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టారు. ప్రధాన డ్యామ్ 45 మీటర్లు ఎత్తుకు నిర్మించినా ముంపునకు గురికావని చెప్తూ, నిర్వాసితుల కోసం కుక్కునూరు మండలంలోని రావికుంట, కివ్వాక, మర్రిపాడు, పుల్లప్పగూడెం, వెంకటాపురంలో దాదాపు నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో సగానికిపైగా ఇళ్లు పూర్తయ్యాయి. పరిహారం ఇచ్చే వరకూ తాము గ్రామాలను వదిలి వెళ్లలేమంటూ నిర్వాసితులు ఇంకా అక్కడికి వెళ్లలేదు. కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి వరద 37 మీటర్లకు చేరుకుంది.
ఈపాటి వరదకే కివ్వాక పునరావాస కాలనీలోని 40కుపైగా ఇళ్లుమునిగిపోయాయి. మిగిలిన నాలుగు పునరావాస కాలనీల చుట్టూ వరద నీరు చేరింది. వేలేరుపాడు, కుక్కునూరులోని దాదాపు గ్రామాలన్నీ ముంపు బారిన పడ్డాయి. 1986 వరదలకు సైతం మునగని కుక్కునూరు ప్రధాన రహదారిపై ప్రస్తుతం పది అడుగులపైన వరద నీరు చేరింది. ముంపులోలేని ప్రాంతాలుగా కమ్మరిగూడెం, నల్లకుంట, బోరుగుంపు, పంజారివారిగూడెం, రాజీవ్‌నగర్‌లను తేల్చారు. ప్రస్తుత వరదలకు ఈ గ్రామాలన్నీ ముంపు బారిన పడ్డాయి. కాఫర్ డ్యామ్ వద్ద 37 మీటర్లకే ఈ పరిస్థితి ఉంటే 45 మీటర్ల ఎత్తుకు డ్యామ్ నిర్మాణం పూర్తయితే ఈ గ్రామాలన్ని జలసమాధి అవుతాయి. ప్రస్తుత వరద ఆధారంగా ముంపు మదింపు చేస్తేనే నిర్వాసితులకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది.










