- ఈ తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
ప్రజాశక్తి-తిరుపతి : తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మౌత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది యాత్రికులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బ్రహ్మౌత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. ఆన్‌లైన్‌లో లక్షా 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామన్నారు. ప్రతి నిత్యం సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. అన్నప్రసాద సముదాయంలో నిత్యం లక్ష మందికి అన్నప్రసాద వితరణ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. 3500 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 6 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచామని.. నిత్యం 4 లక్షల లడ్డూలు తయారు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలలో 17వ తేదీన వార్షిక బ్రహ్మౌత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 18వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మౌత్సవాలు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీన శ్రీవారికి పట్టు వస్త్రాలను సీఎం జగన్ సమర్పించనున్నారు. 22వ తేదీన గరుడ వాహన సేవ, 23వ తేదీన స్వర్ణ రథ ఊరేగింపు జరగనున్నాయి. 27వ తేదీన ధ్వజాఅవరోహణంతో వార్షిక బ్రహ్మౌత్సవాలు ముగియనున్నాయి.










