May 06,2023 22:04

తస్కెంట్‌(ఉజ్బెకిస్తాన్‌): ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత బాక్సర్లు ఆకాశ్‌ సంఘ్వాన్‌, నిషాంత్‌ దేవ్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన రౌండ్‌-32 67కిలోల విభాగంలో ఆకాశ్‌ సంఘ్వాన్‌, 71కిలోల విభాగంలో నిషాంత్‌ దేవ్‌ ప్రత్యర్థులపై సునాయాసంగా గెలిచారు. 67కిలోల విభాగంలో సంఘ్వాన్‌ కొరియాకు చెందిన సంగ్‌మన్‌ లీపై 5-0పాయింట్లతో గెలిచాడు. ఆకాశ్‌ తొలిరౌండ్‌ నుంచే ప్రత్యర్ధిపై చక్కటి పంచ్‌లతో ప్రత్యర్ధికి గుక్క తిప్పుకోకుండా చేశాడు. ప్రి క్వార్టర్స్‌లో ఆకాశ్‌ కజకిస్తాన్‌కు చెందిన దులత్‌ బెక్‌బౌతో తలపడనున్నాడు. ఇక నిషాంత్‌ కూడా కొరియాకు చెందిన మరో బాక్సర్‌ను చిత్తుచేసి ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. నిషాంత్‌ ప్రి క్వార్టర్స్‌లో పాలస్తీనాకు చెందిన ఫొఖా నిదాల్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.