Jun 29,2023 22:12

ముంబైకర్‌ ఎంపిక ఇక లాంఛనమే
ముంబయి : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌గా మాజీ క్రికెటర్‌, ముంబైకర్‌ అజిత్‌ అగర్కార్‌ ఎంపిక కావటం లాంఛనంగా కనిపిస్తుంది. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌గా వరుసగా రెండోసారి ఎంపికైన చేతన్‌ శర్మ.. ఓ టెలివిజన్‌ ఛానల్‌ శూల శోధనలో వివాదాస్పద వ్యాఖ్యలతో పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చీఫ్‌ సెలక్టర్‌ పదవి ఖాళీగా ఉండగా.. తాజాగా బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.
చీఫ్‌ సెలక్టర్‌ పదవికి దరఖాస్తు చేసిన అజిత్‌ అగార్కర్‌..ఇటీవల క్రికెట్‌ సలహా సంఘం (సీఏసీ) ఎదుట ఇంటర్వ్యూకు సైతం హాజరైనట్టు సమాచారం. దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, రవిశాస్త్రి పేర్లు సైతం చీఫ్‌ సెలక్టర్‌ పదవి రేసులో వినిపించినా.. ఆ ఇద్దరు దరఖాస్తు చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ గతంలోనే చీఫ్‌ సెలక్టర్‌గా పని చేశారు. ఓ సెలక్టర్‌ సెలక్షన్‌ కమిటీ ప్యానల్‌లో గరిష్టంగా నాలుగేండ్లు పని చేసేందుకు అర్హుడు. వెంగ్‌సర్కార్‌ గతంలో మూడేండ్ల పాటు చీఫ్‌ సెలక్టర్‌గా కొనసాగారు. చేతన్‌ శర్మ సెలక్షన్‌ ప్యానల్‌లో సెలక్టర్‌గా చేరేందుకు అజిత్‌ అగర్కార్‌ ఆసక్తి చూపినా.. ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అడ్డుచెప్పినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. అజిత్‌ అగర్కార్‌ సెలక్షన్‌ కమిటీలో ఉండగా చేతన్‌ శర్మను చీఫ్‌ సెలక్టర్‌గా కొనసాగించటం సైతం బోర్డుకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. దీంతో అజిత్‌ అగార్కర్‌ను గతంలో సెలక్టర్‌ పదవికి పరిగణనలోకి తీసుకోలేదు. ఇక తాజాగా ఐపీఎల్‌ ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ సహాయక కోచ్‌ బాధ్యతల నుంచి అజిత్‌ అగార్కర్‌ తప్పుకున్నారు. దీంతో అజిత్‌ అగర్కార్‌ చీఫ్‌ సెలక్టర్‌ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా అనిపిస్తుంది.
వేతనం పెంపు? : సుదీర్ఘ విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష అనుభవం కలిగిన మాజీ క్రికెటర్‌ చీఫ్‌ సెలక్టర్‌గా రానుండటంతో.. సెలక్షన్‌ కమిటీ వేతనాలను బీసీసీఐ సవరించే అవకాశం ఉంది. ప్రస్తుతం చీఫ్‌ సెలక్టర్‌ ఏడాది రూ. 1 కోటి, ఇతర సెలక్టర్లు ఏడాదికి రూ.90 లక్షలు వేతనంగా అందుకుంటున్నారు. చీఫ్‌ సెలక్టర్‌ వేతనం రూ. 2 కోట్లు, సెలక్టర్‌ వేతనం రూ.1.5 కోట్లకు పెంపుదల ప్రతిపాదనలు బోర్డు ముందు ఉన్నట్టు సమాచారం.