ముంబయి: ఈ ఏడాది జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత పర్యటనకు రానున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్ తర్వాత ఈ సిరీస్ జరగనుంది. భారత్ వేదికగా జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్‌ముందు ఈ సిరీస్ భారత్‌లో జరగనున్నడంతో భారతజట్టుకు ప్రాక్టీస్‌కు ఈ సిరీస్ దోహదపడనున్నట్లు బిసిసిఐ ఆ ప్రకటనలో తెలిపింది. బిసిసిఐ కార్యదర్శి జే షా ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఈ సిరీస్‌కు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఐసిసి ఫ్యూటర్ టూర్ ప్రోగామ్‌లో ఈ సిరీస్‌ను చేర్చబడలేదని, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లతో చర్చించిన అనంతరమే ఈ టూర్‌కు షెడ్యూల్ ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. జూన్ 16న డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ షెడ్యూల్ ఉండనున్నట్లు వెల్లడించారు. ఇక స్టార్ ఇండియాతో మార్చి నెలాఖరుతో ఒప్పందం ముగియడంతో ఈ సిరీస్ కోసం బిసిసిఐ విడిగా టెండర్లను ఆహ్వానిస్తుందా? లేక తర్వాత నాలుగేళ్లకు మీడియా హక్కులకు టెండర్లను ఆహ్వానిస్తుందా? అనే విషయంపై స్పష్టత రానుంది.










