- మెడలిస్టులకు ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయమే
- 2023-2028 క్రీడా పాలసీలో కసరత్తు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఉద్యోగాల భర్తీలో ఇప్పటివరకు అమలు చేస్తున్న క్రీడల కోటాను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు తెలిసింది. జాతీయ, అరతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల ఎంతోమంది ఆటగాళ్లు పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా, అధికారులుగా పనిచేస్తున్నారు. ఇకపై ఆ విధానం రద్దు కానుంది.
ఇప్పుడున్న క్రీడా విధానాన్ని మార్పులు చేసి కొత్తగా 2023-28 విధానాన్ని ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే పలువురు అధికారులు, క్రీడా నిపుణులతో కూడా ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. ఇదే సమయంలో ఆటగాళ్లకు ఉద్యోగావకాశాలపై కూడా అధికారులు లాంఛనంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మెడల్స్ సాధించిన వారికి ఇకపై ఉద్యోగాలు ఇవ్వడం అనే విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించారు. రానున్న కాలంలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించిన వారికి కేవలం ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయం మాత్రమే అందించాలని నిర్ణయించడం గమనార్హం.
ఇప్పటివరకు మెడల్స్ సాధించిన వారికి అనేక రాష్ట్రాల్లో గౌరవ సూచికంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కువగా పోలీస్, రెవెన్యూ శాఖల్లో వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా గణనీయంగా రాణించిన వారికి సర్వీసెస్, రైల్వే, పోర్టులు వంటి వాటిల్లో ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోటాలో ఉద్యోగాలు రద్దు చేయడానికి అడుగులు వేస్తోంది. తాజాగా ఆడుదాం ఆంధ్రా నిర్వహణ నేపథ్యంలో ఉన్నతాధికారుల కమిటీ నిర్వహిస్తున్న భేటీల్లో స్పోర్ట్స్ పాలసీపై కొంతమంది మాజీ సీనియర్ ఆటగాళ్లు, క్రీడా నిపుణుల నుంచి సూచనలు వచ్చినట్లు సమాచారం.
ప్రతి గ్రామంలోనూ క్రీడా క్లబ్
కొత్తగా తీసుకొస్తున్న క్రీడా పాలసీపైనా కీలకంగా చర్చ జరుగుతోంది. దీనిపై అధ్యయనం కోసం ఒక బృందాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పంపించనున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అధ్యయనం కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త పాలసీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించే క్రీడా పోటీలను, ప్రతి గ్రామంలో ఒక స్పోర్ట్స్ క్లబ్‌ను ఏర్పాటుచేసే అంశాలను కూడా పాలసీలో పొందుపరచనున్నారు. అలాగే ప్రతియేటా ఆడుదాం ఆంధ్రాతోపాటు, పాఠశాల క్రీడలను కూడా నిర్వహించేలా పాలసీలో పొందుపరచనున్నారు.










