పెడన (కృష్ణా) : కృష్ణాజిల్లా పెడనలోని ఎపి మంత్రి జోగి రమేష్ కార్యాలయంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యరగాని ఆదినారాయణ సోమవారం సాయంత్రం కనిపించకుండాపోయాడు. ఓ లేఖతోపాటు వాట్సాప్ స్టేటస్ పోస్టు పెట్టడంతో సదరు ప్రాంతంలో ఆదినారాయణ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పెడన సిఐ హబీబ్‌బాషా కథనం మేరకు .... పెడన మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన ఆదినారాయణ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొంటూ ఓ లేఖతోపాటు మచిలీపట్నం-కోడూరు మండలాలను కృష్ణానది వద్ద అనుసంధానించే ఉల్లిపాలెం వంతెన వద్ద దిగిన ఫొటోను ఆయన వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేశాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, వైసిపి నాయకులు, మంత్రి కార్యాలయ సిబ్బందితో మంగళవారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి గాలింపు చేపట్టారు. వంతెనపై బైక్‌తోపాటు ట్యాంకు కవర్‌లో ఫోన్, బంగారు గొలుసు, ఉంగరాలు, చెప్పులను గుర్తించారు. కోడూరు పోలీసులు ముమ్మరంగా ఆదినారాయణ కోసం గాలిస్తున్నా నిన్న సాయంత్రం వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదినారాయణకు వివాహమై సంవత్సరమయ్యింది. క్రికెట్ బెట్టింగులు, ఇతర కారణాలతో ఆయన ఎక్కువ మొత్తంలో అప్పులు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదని సిఐ తెలిపారు. ఆదినారాయణ ఆచూకీ కోసం ... ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టాలని మంత్రి జోగి రమేష్, కలెక్టర్‌ను ఆదేశించారు.










