Sep 12,2022 10:37
  • భూముల లీజు, షాపులు వేలం పాటలపై ఆరా

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దేవాదాయశాఖలో జరుగుతున్న అవినీతిపై ఎసిబి దృష్టి సారించింది. ఆ శాఖలో అవినీతి రాజ్యమేలుతోందంటూ అవినీతి నిరోధకశాఖకు పెద్ద ఎత్తున పిర్యాదులు వెళ్లాయి. భూముల వేలం పాటల నిర్వహణ, లైసెన్స్‌ లీజులు రెన్యువల్స్‌, అద్దెల వసూళ్లు, విలువైన ఆస్తులకు సంబందించిన రికార్డుల టాంపరింగ్‌, ఆన్‌లైన్‌లో సమాచారాన్ని లేకుండా చేయడం వంటి అంశాలను ఈ ఫిర్యాదుల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎసిబి అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కెఎం మహేశ్వరరాజు తాజాగా ఎండోమెంట్‌ కమిషనరు హరి జవహర్‌ లాల్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. దీనిలో దేవాదాయశాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిఅన్ని అంశాలను పరిశీలించి త్వరిత గతిన నివేదిక ఇవ్వాలని ఎసిబి కోరింది. దీంతో పాటు అనేక ఇతర అంశాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. 2019లో అన్ని సెక్షన్లలో విధులు నిర్వహించిన ఉద్యోగుల పేర్లు, వారి హోదాలు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఏ హోదాలతో పనిచేశారనే వివరాలను తెలియచేయాలని ఎసిబి కోరింది. వీటితోపాటు కారుణ్య నియామకాలు, మెడికల్‌ రీ ఎంబర్స్‌మెంట్‌ బిల్స్‌, బడ్జెట్‌ కేటాయింపులు, నగదు ఉపసంహరణలు, క్యాడర్‌ స్ట్రెంత్‌ పోస్టులు మంజూరు, ఔట్‌సోర్సింగ్‌తో పాటు శాఖాపరమైన అంతర్గత విచారణలకు సంబందించిన పలు నివేదికలను కూడా ఎసిబి కోరినట్లు తెలిసింది. వీటితో పాటు శ్రీరంగం సినిమా హాలు లీజు ఫైలు, తిరుపతి గాలిగోపురంకు సంబందించి రికార్డుల్లో ఎంట్రీలు పూర్తి స్ధాయిలో నివేదికలో పొందుపరా చాలని పేర్కొన్నారు. కడప జిల్లా ఈశ్వరిమఠంలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, లోకాయుక్త దర్యాప్తులో చేపట్టిన యాక్షన్‌ టేకన్‌ రిపోర్టు ఇవ్వాలని ఎసిబి కోరింది.అదే సంవత్సరం శ్రీశైలంలో షాపులకు తాత్కాలిక లైసెన్స్‌లు ఇవ్వడానికి సంబంధించిన ఫైల్స్‌ను పూర్తి స్ధాయిలో నివేదికను ఇవ్వాలని ఎసిబి అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కోరారు.