- బహిరంగ సభలో కాంగ్రెస్ నేతల డిమాండ్
ప్రజాశక్తి - కడప :కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సిందేనని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు పల్లంరాజు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సెయిల్ ఆధ్వర్యంలో కడపలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తామన్నారు. 'కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏడురోడ్ల కూడలి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పల్లం రాజు, గిడుగు రుద్రరాజు మాట్లాడారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి, వైసిపి పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. బిజెపి చేతిలో మూడు పార్టీలు కీలుబమ్మలుగా మారాయని విమర్శించారు. ఈ ఏడాది చివరిలో జరగబోయే రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే సంవత్సరం జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పిసిసి మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి మాట్లాడుతూ.. కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు అని తెలిపారు. ఎఐసిసి సెక్రటరీ మయప్పన్ మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఫైల్ మీద మొదటి సంతకం పెడతానని రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, ఎస్‌సి సెల్ రాష్ట్ర చైర్మన్ సాకే శంకర్, నజీర్ అహ్మద్, మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










