- వ్యవసాయాన్ని సరుకుగా మార్చడమే సామ్రాజ్యవాదుల లక్ష్యం
- వారికి లొంగిపోతే ఆఫ్రికా దేశాలకు పట్టిన గతే...
- అరిబండి లక్ష్మీనారాయణ 5వ స్మారకోపన్యాసంలో ప్రభాత్ పట్నాయక్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : వాణిజ్య పంటలతో దేశ ప్రజల ఆహారభద్రతకు పెనుముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ తెలిపారు. అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల కుట్రలకు ప్రధాని నరేంద్ర మోడీ తలొగ్గుతున్నారని విమర్శించారు. 'మారుతున్న ప్రపంచ సంబంధాలు, వాతావరణం... వ్యవసాయ జాతీయ విధానం', వానాకాలం పంటల సాగుపై మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరిబండి ఫౌండేషన్, తెలంగాణ రైతు సంఘం సంయుక్తంగా సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో ప్రభాత్ పట్నాయక్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని సరుకుగా మార్చడమే లక్ష్యంగా సామ్రాజ్యవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి సర్కారు అందుకనుగుణంగానే మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రైతులు పోరాడి ఆ చట్టాలను వెనక్కి తిప్పికొట్టినా.. దేశానికి ఆ ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. రైతులపై వలసవాదులు క్రూర పద్ధతులు ప్రయోగించి దోపిడీ చేశారని వివరించారు. నేటి పాలకులు పరోక్ష పద్ధతులతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సామ్రాజ్యవాదులకు లొంగిపోతే ఆఫ్రికా దేశాలకు పట్టిన గతే మనకీ పడుతుందని హెచ్చరించారు. రైతు రక్షణ కోసం అప్రమత్తతతో ఉండడం మరింత అవసరమని అన్నారు. సామ్రాజ్య వాదులు వ్యవసాయ రంగంలోకి చొచ్చుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లాడ్‌లో పత్తి పంట సాగు కాదని, అయినా ఆ దేశంలో భారీగా పత్తి పరిశ్రమలు వచ్చాయన్నారు. రైతుల భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది పెట్టుబడిదారుల కుట్రగా ఉందని తెలిపారు. వలసదేశాల్లో తమకు అనుకూలమైన పంటలు సాగు చేసేలా ఒత్తిడి చేస్తున్నారని గుర్తు చేశారు.
ఎఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్ మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అంటూ మోడీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు.
రైతు ఆదాయం గతంలో కంటే పడిపోయిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో సంక్షోభ ఫలితంగా దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా (2014- 23) లక్ష మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులే కాకుండా కూలీలు, నిరుద్యోగ యువకులు ఉపాధి కరువై చనిపోయారని గుర్తు చేశారు. స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందాలతో శ్రీలంక తీవ్రమైన వ్యవసాయ సంక్షోభంలోకి పోవడాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ విధానంలో బిజెపికి, కాంగ్రెస్‌కు పెద్ద తేడాలేదన్నారు. వ్యవసాయం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోతే వారిదే పెత్తనం అవుతుందన్నారు. వ్యవసాయరంగ నిపుణులు డాక్టర్ అల్ధాప్ జానయ్య, ప్రొఫెసర్ రాజిరెడ్డి, ఎఐకెఎస్ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి టి సాగర్, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ మాట్లాడారు.










