- పతకాలు ఖాయం చేసిన హుసాముద్దీన్, దీపక్, నిషాంత్
- ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్
తస్కెంట్(కజకిస్తాన్): ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు నయా చరిత్ర సృష్టించారు. గతంలో ఒక్కో పతకానికే పరిమితమైన భారత బాక్సర్లు.. ఈసారి ఏకంగా మూడు పతకాలను ఖాయం చేశారు. దీపక్, హుసాముద్దీన్, నిషాంత్ సెమీస్‌కు చేరడంతో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. ఇలా భారత్‌కు ఒకేసారి మూడు పతకాలు దక్కడం ఇదే తొలిసారి. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ పోటీల్లో దీపక్ భోరియా, మహ్మద్ హుసాముద్దీన్, నిషాంత్ దేవ్ ప్రత్యర్థులను చిత్తుచేసి సెమీస్‌కు చేరారు. 51కిలోల విభాగంలో దీపక్ భోరియా 5-0పాయింట్ల తేడాతో కిర్గిజికిస్తాన్‌కు చెందిన నుర్జిగిట్ దుబ్ష్‌దేవ్‌పై, నిషాంత్ దేవ్ 5-0పాయింట్ల తేడాతో క్యూబాకు చెందిన సిడెల్ హోర్టాపై ఘన విజయం సాధించగా.. హుసాముద్దీన్ ఉత్కంఠ పోరులో 4-3పాయింట్ల తేడాతో 5వ సీడ్, బల్గేరియాకు చెందిన జావియర్ ఇబానిజ్‌ను చిత్తుచేశాడు. సెమీస్‌కు ముగ్గురు భారత బాక్సర్లు చేరడంతో వీరందరికీ కనీసం కాంస్య పతకం ఖాయం కానుంది. ఈ టోర్నమెంట్‌లో సెమీస్‌లో ఓడిన ఇద్దరు బాక్సర్లకూ కాంస్య పతకాలు దక్కనున్నాయి. 12న జరిగే సెమీస్‌లో నిషాంత్ దేవ్.. 4వ సీడ్, కజకిస్తాన్‌కు చెందిన అస్లన్‌బెక్ సింబర్జెనోవ్‌తో తలపడనున్నాడు.
గతంలో భారత్‌కు దక్కిన పతకాలు..
2009 : విజేందర్ సింగ్(కాంస్యం)
2011 : వికాశ్ క్రిషన్(కాంస్యం)
2015 : శివ థాపా(కాంస్యం)
2017 : గౌరవ్ బింధూరి(కాంస్యం)
2019 : అమిత్ పంగల్(కాంస్యం)
2021 : ఆకాశ్ కుమార్(కాంస్యం)










