Jun 23,2023 22:15

ఓమన్‌పై 10వికెట్ల తేడాతో గెలుపు
హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫై గ్రూప్‌ాబిలో శ్రీలంక, స్కాట్లాండ్‌ జట్లు ఘన విజయం సాధించాయి. శుక్రవారం జరిగిన లీగ్‌ పోటీల్లో మాజీ ఛాంపియన్‌ శ్రీలంక జట్టు 10వికెట్ల తేడాతో ఓమన్‌ను ఓడించగా.. స్కాట్లాండ్‌ జట్టు 111పరుగుల తేడాతో యుఏఇపై ఘన విజయం సాధించింది. బులావయో వేదికగా జరిగిన పోటీలో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఓమన్‌ జట్టుహసరంగ(5/13) దెబ్బకు 30.2 ఓవర్లలో 98పరుగులకే కుప్పకూలింది. ఆ లక్ష్యాన్ని లంక జట్టు 15ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్‌ దిముత్‌ కరుణరత్నే(61నాటౌట్‌) అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. మరో ఓపెనర్‌ ప్రథుమ్‌ నిస్సంక(37 నాటౌట్‌)గా నిలిచాడు. హసరంగకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఓమన్‌పై భారీ విజయంతో లంక ఈ ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయర్స్‌ అవకాశాలు మెరుగుపరుచుకుంది. గ్రూప్‌ -ఏ, గ్రూప్‌ -బిలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు వరల్డ్‌ కప్‌లో ఆడేందుకు అర్హత సాధిస్తాయి.
స్కాట్లాండ్‌ సునాయాసంగా..
మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ జట్టు యుఏఇపై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 282పరుగులు చేసింది. కెప్టెన్‌ బెర్మింగ్టన్‌(127) సెంచరీతో చెలరేగాడు. సిద్ధిక్‌కు మూడు, నసేర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో యుఏఇ జట్టు 35.3ఓవర్లలో 171పరుగులకు కుప్పకూలింది. షరీఫ్‌కు నాలుగు, సోలేకు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బెర్మింగ్టన్‌కు లభించింది.