Aug 27,2022 07:54
  • ఖరీఫ్‌ ఎరువుల వినియోగంపై అంచనా
  • ధరల పెరుగుదలే కారణం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ ఖరీఫ్‌లో ఎరువుల వినియోగం ఐదు శాతం తగ్గే అవకాశాలున్నట్లు అంచనా. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినందువలన రైతులు వాటి వాడకాన్ని క్రమేణ తగ్గిస్తున్నట్లు చెబుతున్నారు. పొటాష్‌, కాంప్లెక్స్‌లతో పాటు యూరియా వినియోగం సైతం తగ్గుతున్నట్లు గుర్తించారు. ధరలు ఏ రోజుకారోజే అన్నట్లుండటంతో కాంప్లెక్స్‌ల వాడకం బాగా తగ్గుతోంది. శాస్త్రవేత్తలు చేసిన సిఫా రసుల మేరకు సమయానికి ఎరువులు వేయకపోతే పంటల ఎదుగుదల, ఉత్పత్తి, ఉత్పాదకతలపై ప్రభావం పడుతుంది. ఎరువుల వాడకం తగ్గడానికి ప్రధాన కారణం ధరలు పెరగడమే. అదనకు కావా ల్సిన ఎరువు బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో లేకపోవడం, బ్లాక్‌ మార్కెట్‌, అవసరం లేకపోయినా అధిక ధరలపై ఉప ఉత్పత్తులు అంటగట్టడం, రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో అరకొరగా ఎరువులు పెట్టడం ఎరువుల వాడకం తగ్గడానికి మరికొన్ని కారణాలుగా పేర్కొంటున్నారు.
 

                                                               ఇంకా ఎద్దడి లేదు

మొత్తమ్మీద వర్షాలు బాగున్నప్పటికీ అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, మరికొన్ని చోట్ల డ్రైస్పెల్స్‌ నెలకొనడంతో సాగు నెమ్మదిగా సాగుతోంది. పెట్టుబడుల పెరుగుదల, పంటలకు గిట్టుబాటు లేమి వలన రైతులు సేద్యం సాగించడానికి వెనకాముందాడుతున్నారు. దాంతో ఎరువుల వినియోగం తగ్గింది. నిరుడు ఖరీఫ్‌లో అన్ని ఎరువులూ కలుపుకొని 15.83 లక్షల టన్నులు అమ్ముడుపోగా, ఆ అంచనాతో ఈ తడవ 16.40 లక్షల టన్నులు కేటాయించారు. ఇప్పటి వరకు 8 లక్షల టన్నులు అమ్ముడు పోయాయి. ఈ అమ్మకాలు ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు జరిగాయి. సీజన్‌లో దాదాపు మూడు మాసాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ఖరీఫ్‌ కాలం. ఇంకా 35 రోజులే సమయముంది. అక్టోబర్‌ రెండోవారం వరకు సాగు సాగినా కొన్ని ఏరియాల్లో అదీ ఒకటి అరా పంటలే. అందుకే అంచనా మేరకు ఎరువుల అమ్మకాలు సాగే పరిస్థితి లేదు. అయితే వ్యవసాయశాఖ వేరే విధంగా చెబుతోంది. వర్షాల వలన సాగు ఇంకా పుంజుకోలేదని, ఎరువులకు ఎద్దడి పరిస్థితి ఇంకా రాలేదని, రాబోయే రోజుల్లో సేల్స్‌ పెరుగుతాయని ఆశాభావంతో ఉంది. సీజన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 36.68 లక్షల హెక్టార్లు కాగా ఆగస్టు 24 నాటికి 27.84 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే 72 శాతం సేద్యం జరిగింది. సెప్టెంబర్‌లో సాగు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే వేసిన పంటలకు రెండవ, మూడవ సారి ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ఎరువులకు ఎద్దడి పెరిగి అమ్మకాలు బానే సాగుతాయని చెబుతున్నారు.
 

                                                                     అధిక భారం

ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎంఒపి 50 కిలోల బస్తా నిరుడు జూన్‌లో రూ.875 కాగా ఇప్పుడు రూ.1,700. ముఖ్యమైన కాంప్లెక్స్‌ ఎరువులు రూ.1,475-1,700 పలుకుతున్నాయి. డిఎపి రూ.1,200 ఉన్నది కాస్తా రూ.1,350 అయింది. ఒక్క యూరియానే రూ.268. ఇవి ఎంఆర్‌పిలు. బ్లాక్‌ మార్కెట్‌లో ఇంకా ఎక్కువే. ధరలు ఈ విధంగా పెరుగుతున్నందునే రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గిస్తున్నారు.