ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం గ్యాస్ అధీకృత డీలర్ నుంచి వినియోగదారుని నివాసం ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే ఎటువంటి అదనపు రుసుము చెల్లించనవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిఒఆర్‌టి నెంబరు 12 సిఎఎఫ్ అండ్ సిఎస్ డిపార్టుమెంట్ తేదీ 18.02.2019 ప్రకారం అదనపు చార్జీలు ప్రభుత్వం సూచించిన మేరకు మాత్రమే వసూలు చేయాలని తెలిపారు. ఎల్‌పిజి సిలిండర్ కోసం రవాణా ఛార్జీలను ఐదు కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు అదనపు రుసుము సిలిండర్ ధరకు రూ.20, 15 కిలోమీటర్లు ఆపైన దూరం ఉంటే అదనపు చార్జీలు రూ.30 మాత్రమే చెల్లించాలన్నారు. డెలివరీ బార్సు ప్రభుత్వం అనుమతించిన దానికంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తే సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు లేదా జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా సేల్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎల్‌పిజి వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబరు 1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్‌కు లేదా ఆయిల్ కంపెనీ టోల్ ఫ్రీ నెంబరు 1800 2333555నకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ సూచించారు. ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ జరిపి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటారని అరుణ్‌కుమార్ తెలిపారు.










