Aug 07,2023 16:41

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : రోల మడుగు అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి 40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ 20 లక్షలు ఉంటుందని తెలిపారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.