Mar 14,2023 17:20

న్యూఢిల్లీ  :   భారత్‌ కాలుష్యానికి నిలయంగా నిలిచినట్లు ఓ నివేదిక స్పష్టం చేసింది. టాప్‌ 50 నగరాల్లో 37 నగరాలు భారత్‌లోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు గతేడాది భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య దేశాల్లో ఎనిమిదవదిగా నిలిచింది. 2021లో ఈ సూచిలో భారత్‌ ఐదవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారత్‌లోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. స్విస్‌కి చెందిన సంస్థ ఐక్యూఎయిర్‌ 'వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ' పేరుతో ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. 131 దేశాల నుండి 30,000 కి పైగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల మానిటర్‌ల నుండి ఈ సమాచారాన్ని సేకరించింది. ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించిన పిఎం 2.5 స్థాయిపై ఆధారపడి ఈ నివేదికను రూపొందించింది. 7,300 కంటే ఎక్కువ నగరాలను కలిగి ఉన్న ఈ జాబితాలో భారత్‌లోని పలు నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. 2017 నుండి ఇప్పటివరకు 2,200కు పైగా నగరాలు తక్కువ ర్యాంకులను సాధించినట్లు నివేదిక స్పష్టం చేసింది.

ఢిల్లీ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఉంది. అయితే ఈ ఏడాది నివేదికలో గ్రేటర్‌ ఢిల్లీ, న్యూఢిల్లీల మధ్య తేడాను చూపించింది. అయితే రెండూ కూడా టాప్‌ 10లోనే ఉండటం గమనార్హం. న్యూఢిల్లీ 2వ స్థానంలో నిలవగా, ప్రపంచంలోనే మొదటి కాలుష్య నగరంగా చాద్‌ రాజధాని ఎన్‌డిజమెనా నిలిచింది. 31 నగరాలు కాలుష్య స్థాయిలలో రెండంకెల శాతం క్షీణతను నమోదు చేశాయి. వీటిలో పది యుపిలో ఉండగా, ఏడు హర్యానాలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా ఢిల్లీ తర్వాతి స్థానంలో నిలిచింది.