Sep 16,2023 14:59
  • నిద్రిస్తున్న దంపతులపై దాడి
  • నిందితుడిని కొట్టి చంపిన స్థానికులు

ప్రజాశక్తి-యాడికి (అనంతపురం) : అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరు గ్రామంలో శనివారం వేకువజామున దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని వ్యక్తి కొడవలితో వీరంగం సృష్టించాడు. నిద్రిస్తున్న భార్యాభర్తలను దాడి చేసి వారిని హత్య చేశాడు. అతడిని నియంత్రించే క్రమంలో స్థానికులు దాడి చేయడంతో మరణించాడు. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో నిట్టూరు గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... నిట్టూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున దంపతులు రజక సుంకమ్మ (45), రజక బాలరాజు (50) తమ ఇంటి వద్ద నిద్రిస్తున్నారు. వీరి ఇంటి పక్కనే రజక ప్రసాద్‌(40) నివసిస్తున్నాడు. గత కొంతకాలంగా ఆయనకు మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో సుంకమ్మ, బాలరాజుపై కొడవలితో దాడికి పాల్పడ్డాడు. భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. హత్య అనంతరం అతను ఆ ఇంటి వద్ద కూర్చొన్నాడు. గుర్తించిన స్థానికులు ప్రసాద్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానికులపైనా దాడికి యత్నించడంతో బండరాళ్లతో కొట్టి చంపారు. ప్రసాద్‌తో గొడవ పడి ఆయన భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఒంటరిగా నివసిస్తున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్‌పి తెలిపారు.