Feb 11,2023 21:35

ఫొటో : మాట్లాడుతున్న జె.వి.వి.నాయకులు

28న జెవివి సైన్స్‌ దినోత్సవ పోటీలు
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణ జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో 28వ తేదీన సైన్స్‌ దినోత్సవం ఘనంగా జరపాలని నిర్ణయించినట్లు జెవివి పట్టణ అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం స్థానిక ''జర్నలిస్ట్‌క్లబ్‌''లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు జె.వి.వి. ఉపాధ్యక్షులు పి.జానకిరామ్‌, షేక్‌.ఖాదర్‌బాషా, కార్యవర్గసభ్యులు చాకలకొండ శారద, హరినారపరెడ్డిలు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జెవివి హైస్కూల్‌ విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించేందు కోసం 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు సైన్స్‌ వారోత్సవాలను జరుపుతుందన్నారు. ఈ పోటీలలో 6,7 తరగతుల నుండి ముగ్గురు విద్యార్థులను జూనియర్లుగా 8,9,10 తరగతుల నుండి ముగ్గురు విద్యార్థులను సీనియర్లుగా పరిగణించి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో 13న వ్యాసరచన పోటీలు జూనియర్లుకు ''ప్రకృతిరక్షణ-మన సంరక్షణ'', సీనియర్లకు ''నిత్య జీవితంలో విజ్ఞానశాస్త్రం''అనే అంశాలపై జరుగుతాయన్నారు.
14వతేదీన వక్తృత్వపోటీలు జూనియర్లకు ''శాస్త్రీయ దృక్పథం-మానవ ప్రగతికి సోపానం'', సీనియర్లకు ''వైజ్ఞానిక పరిశోధనలో మానవుడు ఇంతవరకు నాటిన మైలురాళ్లు-సాధించిన విజయాలు''అనే అంశాలపై జరుగుతాయన్నారు. 15వ తేదీన చిత్రలేఖనం జూనియర్లకు మతం కన్నా- మానవత్వం మిన్న'', సీనియర్లకు ''కాలుష్య కారకాల నిర్మూలన- ఆరోగ్యకర జీవనానికి మూలం''అనే అంశాలపై నిర్వహిస్తామన్నారు. నృత్యపోటీలు ''శాస్త్రీయ-జానపద నృత్య పోటీలు (అందరికీ)జరుగుతాయన్నారు. 17న సందేశాత్మక పాటలు నిర్వహిస్తామన్నారు. 21వ తేదీన సైన్స్‌క్విజ్‌ (సైన్స్‌, జి.కె.,విజువల్‌) పోటీలు జరుగుతాయన్నారు. ఈ వారం రోజులపాటు పోటీలు ఆర్‌డిఒ కార్యాలయ ఆవరణంలోని రెడ్‌క్రాస్‌ భవనంలో జరుగుతాయని, ప్రతిరోజూ ఉదయం 9.30గంటలకే పోటీలు ఖఛ్ఛితంగా ప్రారంభమవుతాయన్నారు. వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు సమయం కేవలం ఒక్క గంట మాత్రమే వ్యవధి ఇస్తామన్నారు. 28వ తేదీ సైన్స్‌ డే రోజున ఉదయం 9గంటల నుండి విద్యార్థులు తయారుచేసే, వైజ్ఞానిక ప్రదర్శనల పోటీ ఉంటుందన్నారు. కనుక విద్యార్థులు తమసైన్స్‌ ప్రదర్శనలను తయారు చేసుకుని, కమిటీ కేటాయించిన ప్రదర్శనా స్థలంలో ప్రదర్శనకు సిధ్ధంగా ఉండాలని వారు తెలియజేశారు. ప్రదర్శనలు జరిగిన చోటే సైన్స్‌ దినోత్సవ సభ జరుగుతుందని, ఈ సభలో విజేతలకు అతిథుల చేతులమీదుగా బహుమతులు అందజేస్తామన్నారు.