సెంచూరియన్ : టీ20ల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా దక్షిణాఫ్రికా కొత్త రికార్డు నెలకొల్పింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 258 పరుగులు లక్ష్యాన్ని ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా జట్టు అందుకుంది. ఓపెనర్లు డికాక్ 100 పరుగులు (44 బంతుల్లో 8 సిక్స్‌లు, 9 ఫోర్లు)తో కదం తొక్కగా, హెండ్రిక్స్ 68 పరుగులు (28 బంతుల్లో రెండు సిక్స్‌లు, 11 ఫోర్లు)తో విజృంభించారు. ఈ జోడీ తరువాత రోసో (16 పరుగులు), మిల్లర్ (10 పరుగులు) నిరాశపర్చినా కెప్టెన్ మార్కరామ్ 38 పరుగులు (21 బంతుల్లో సిక్స్, నాలుగు ఫోర్లు), కాల్‌సేన్ 16 పరుగులు (7 బంతుల్లో మూడు ఫోర్లు)తో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కీలకమైన మూడో మ్యాచ్ ఈ నెల 28న జరగనుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. చార్లెస్ 118 పరుగులు (46 బంతుల్లో 11 సిక్స్‌లు, 10 ఫోర్లు) చేశారు. ఒక టీ20 మ్యాచ్‌లో మొత్తంగా 517 పరుగులు నమోదు కావడం ఇదే మొదటిసారి. కాగా, టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులను చేధించిన జట్టుగా ఆస్ట్రేలియా ఉండేది. 2018 ఫిబ్రవరిల16న న్యూజిలాండ్‌పై 245 పరుగులను ఆస్ట్రేలియా చేధించింది.










