- ఐపిఎల్‌లో రెండో అత్యధిక స్కోర్ నమోదు
- పంజాబ్‌పై 56పరుగుల తేడాతో లక్నో గెలుపు
మొహాలీ : ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో లక్నో బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. మేయర్స్(54; 24బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), స్టొయినీస్(72; 40బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు) ధనా ధన్ ఇన్నింగ్స్‌తో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 257పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో పంజాబ్ కింగ్స్ జట్టు 19.5ఓవర్లలో 201పరుగులకు ఆలౌటైంది. దీంతో లక్నో జట్టు 56పరుగుల తేడాతో గెలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఫోర్లు, సిక్స్‌లతో మొహాలీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేయడంతో పాటు ఐపిఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను లక్నో జట్టు చేసింది. స్టోయినిస్, ఓపెనర్ కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(45; 19బంతుల్లో 7ఫోర్లు, సిక్సర్) పంజాబ్ బౌలర్లను ఉతికారేశారు. ఆయుష్ బదొని(43) మెరుపు బ్యాటింగ్ తోడయ్యింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 20వ ఓవర్లో దీపక్ హుడా(11) ఫోర్ కొట్టాడు. నాలుగో బంతికి షాట్ ఆడబోయి నికోలస్ పూరన్(45) ఎల్బీగా ఔటయ్యాడు. కనాల్ పాండ్యా(5) బౌండరీ బాదాడు. దాంతో, లక్నో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీశాడు. సామ్ కరన్, లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు.
ఛేదనలో పంజాబ్‌కు మిడిలార్డర్ బ్యాటర్ అథర్వ థాడే(66) అర్ధసెంచరీకి తోడు సికిందర్ రాజా(36) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. యశ్ ఠాకూర్‌కు నాలుగు, నవీన్ ఉల్ హక్‌కు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్టొయినీస్‌కు లభించింది. ఈ గెలుపుతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది.












