Aug 10,2023 07:56

ప్రజాశక్తి- గుంటూరు లీగల్‌ : గతేడాది ఏప్రిల్‌ 30న రేపల్లే రైల్వే స్టేషన్‌లో భర్తపై దాడి చేసి గర్భిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గుంటూరు నాల్గో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఆర్‌.శరత్‌బాబు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలానికి చెందిన గర్భవతి అయిన బాధిత మహిళ తన భర్త, పిల్లలతో కలసి కూలి పనుల నిమిత్తం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు గతేడాది ఏప్రిల్‌ 30న రాత్రి 11.30 గంటలకు రేపల్లె రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో నాగాయలంకకు వెళ్లలేక రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారం చివర నిద్రించారు. వారిని అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో నిందితులు పాలుబొయిన విజయకృష్ణ, పాలుచురి నిఖిల్‌ నిద్రలేపారు. బాధితురాలి భర్తతో గొడవ పెట్టుకుని ఆయన వద్ద ఉన్న రూ.750ను బలవంతంగా లాక్కోని కొడుతుండడంతో బాధితురాలు అడ్డుపడ్డారు. ఆమెను కూడా వారు కొట్టి దూరంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. రేపల్లె టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితులు ఇద్దరికీ 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మరో నిందితుడు మైనర్‌ కావడంతో అతనిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.