Aug 14,2022 22:17

ప్రజాశక్తి-విజయవాడ
ఆటో, మోటార్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 18న ధర్నా చౌక్‌లో జరిగే మహా ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిటీ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నగర గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాధ్‌ కోరారు. మహాధర్నాను విజయవంతం కోరుతూ పోస్టర్‌ ఆవిష్కరణ అనంతరం కాశీనాధ్‌ విలేకరులతో మాట్లాడారు. ఆటో, మోటార్‌ కార్మికులను దెబ్బతీస్తున్న జీవో నెంబర్‌ 21ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బి.జె.పి, రాష్ట్రంలో వై.సి.పి ప్రభుత్వాలు ఆటో, మోటార్‌ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌21 పేరిట వేలాది రూపాయలు జరిమానాలు విధిస్తున్నారని పేర్కొన్నారు.నెలలో రెండుసార్లు సి.ఎన్‌.జి గ్యాస్‌ ధరలు పెంచుతున్నారని, దీని వల్ల ఆటోలను నడపటం కష్టంగా ఉందన్నారు.నగరంలో పోలీసు, ఆర్టిఏ అధికారులు ఆటో కార్మికులపై విఫరీతంగా నమోదుచేస్తూ కార్మికుల ఆదాయానికి గండికొడ్తున్నారని అన్నారు. ఇటువంటి కేసుల నమోదు వల్ల కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని అన్నారు. ఏ.పి. ఆటో, ట్రాలీ డ్రైవర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కారణంగా ఆటో, మోటార్‌ కార్మికులకు కిరాయిలు లేక, వచ్చే రాబడి చాలక అప్పులు పాలై ,ఆటోల ఫైనాన్స్‌ కిస్తీలు కట్టలేక ఆటోలను ఫైనాన్సర్లకు అప్పగించాల్సిన దుస్తితి ఏర్పడిందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలు పాటు ఇళ్ల వద్ద ఆటోలు ఉంచడంతో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ నాయకులు బి. రూబెన్‌ కుమార్‌, ఎం. హనుమంతరావు, వాజ వెంకటేశ్వర రావు, సరగడ కష్ణ ,టి.వి. రమణ, బోయి ప్రసాద్‌, పి. తిరుపతయ్య, డి. నూకరాజు తదితరులు పాల్గొన్నారు.