- టెక్నాలజీ రంగంలో కష్టకాలమే : డబ్ల్యుఇఎఫ్ నివేదిక
జెనివా : వచ్చే ఐదేళ్లలో 1.4 కోట్ల ఉద్యోగాలు పోవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) అంచనా వేసింది. కృత్రిమ మేధ, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఇతర ఆధునిక టెక్నాలజీ వల్ల కార్మికుల మార్కెట్‌లో పెను మార్పులు చోటు చేసుకోవచ్చని విశ్లేషించింది. అన్ని రంగాల్లోని ఉద్యోగులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో దాదాపు 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు కాలం చెల్లనుందని తెలిపింది. 800 కంపెనీల్లోని 1.1 కోట్ల మంది కార్మికులపై ఈ సర్వే చేపట్టినట్లు తెలిపింది. 'ప్యూచర్ ఆఫ్ జాబ్స్' పేరిట విడుదల చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం.. 2027 నాటికి 8.3 కోట్ల ఉద్యోగాలు పోనున్నాయి. ఇదే సమయంలో కొత్తగా 6.9 కోట్ల ఉద్యోగాలు రానున్నాయి. నికరంగా 1.4 కోట్ల ఉద్యోగులు అంటే మొత్తం పనివాళ్లలో రెండు శాతం మంది ఉపాధి పోనుంది. ప్రస్తుత దశాబ్దం ఆరంభంలోనే ఉద్యోగాల కల్పనకు కరోనా, ఆటోమేషన్ రూపంలో పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పావు వంతు ఉద్యోగాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధిలో మందగమనం, సరఫరా కొరతలు సవాల్ విసురుతాయి. వ్యాపారాల్లో మార్పులు పూర్తిగా నూతన సాంకేతికతల అమలుపైనే ఆధారపడతాయి. వచ్చే ఐదేళ్లలో 75 శాతం కంపెనీలు బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధను ఉపయోగించుకోనున్నాయి. పునరుత్పాదక ఇంధన ఇంజినీర్లు, సౌర ఇంధన స్థాపన, వ్యవస్థల రంగాలల్లో ఇంజనీర్లకు డిమాండ్ పెరగనుంది. ఆటోమేషన్ దెబ్బతో బ్యాంక్‌ల్లో నగదు లెక్కించే క్లర్కు పోస్టులు, పోస్టల్ సేవల్లోని క్లర్కులు, టికెట్ క్లర్కులు, డేటా ఎంట్రీ క్లర్క్ ఉద్యోగాల్లో భారీగా తొలగింపులు చోటు చేసుకోనున్నాయి. విద్యా, వ్యవసాయం, డిజిటల్ కామర్స్, వాణిజ్య రంగాల్లో ఉద్యోగాల కల్పన నమోదు కానుంది.










