- అయినా చర్చలే తప్ప చర్యల్లేవు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రుణ యాప్‌లను అడ్డుకట్ట వేయడంలో అధికారుల నిర్లక్ష్యం అన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు ఇటీవల ఎక్కువగా బయట పడుతున్నప్పటికీ గతంలోనే రిజర్వు బ్యాంకు దృష్టికి వచ్చాయి. వీటిపై రిజర్వుబ్యాంకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా హెచ్చరించింది. అయినా ఇప్పటి వరకు చర్యలు లేకపోవడం గమనార్హం. రిజర్వ్‌బ్యాంకు, పలు ఇతర బ్యాంకులు, ఆర్ధికశాఖ అధికారులతో గత ఏడాది నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో రుణ యాప్‌ల వేధింపులకు సంబంధించి 1200 ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఆన్‌లైన్ రుణ యాప్‌లు, డిజిటల్ రుణ యాప్‌లపై ఈ ఫిర్యాదులు నేరుగా రిజర్వ్‌బ్యాంకుకు చేరినట్లు హైదరాబాద్ ఆర్‌బిఐ శాఖ వెల్లడించింది. రుణాల రికవరీకి సంబంధించి బలవంతపు వసూళ్లు, అధిక వడ్డీ, ముందుగానే సర్వీస్ ఛార్జ్ విధింపు, వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై ఈ ఫిర్యాదులు అందినట్లు ఆర్‌బిఐ తెలిపింది. ఈ ఫిర్యాదులను సంబంధిత శాఖలకు ఆర్‌బిఐ పంపించి, పరిశీలించాల్సిందిగా కోరింది. రాష్ట్రాల్లో సిఐడి (నేర దర్యాప్తు విభాగం) ఈ కేసులను దర్యాప్తు చేయాల్సి ఉంది. అనేక పర్యాయాలు కేసులు నమోదు చేసినప్పటికీ వాటిపై తదుపరి చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో వేధింపులు మరింతగా పెరిగాయని భావిస్తున్నారు. వివిధ యాప్‌లు అమలు చేస్తున్న పవర్ బ్యాంకు, డిజిటల్ ఇన్‌కమ్, పీర్ టు పీట్ ఛిట్‌ఫండ్, బీర్‌షెబా చెయిన్ స్కీమ్, బిట్‌బే వంటి పథకాలపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
బడ్స్ అమలుపైనా విమర్శలే
ఆర్ధిక నేరాలను అరికట్టే బడ్స్ (బ్యానిరగ్ ఆఫ్ అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్స్ స్కీమ్స్) చట్టం ఉన్నప్పటికీ, దాని ప్రభావం కనిపించడం లేదు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడంపై ఆర్‌బిఐ, కేంద్రం నుంచి అనేక పర్యాయాలు ఒత్తిడి వస్తున్నప్పటికీ అమలులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. దేశ వ్యాప్తంగా ఆర్ధిక నేరాలు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో 2019లో బడ్స్ చట్టాన్ని కేంద్రం అమలులోకి తీసుకువచ్చింది. డిపాజిట్లు సేకరించి ప్రజలకు మోసం చేసే వ్యక్తులు, సంస్థలపై, ఇతర ఆర్ధిక నేరాలకు పాల్పడే వారిపై ఈ చట్టం ద్వారా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇదే సమయంలో రాష్ట్రాల్లో కూడా కఠిన చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది. దీనికోసం రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేయాలని, అరదుకోసం ఒక అథారిటీని ఏర్పాటుచేయాలని రిజర్వ్‌బ్యాంకు సూచించింది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ అథారిటీ ఏర్పాటు కాలేదు.










